Warangal Road Accident (photo-X)

Hyd, Jan 27: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిలో ఓ పసిపాప కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖిల్లా వరంగల్‌ మామునూరు నాలుగో బెటాలియన్ సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌కు ఇనుప స్తంభాల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అందులోని స్తంభాలు 20 మీటర్ల వరకు రహదారిపై జారి ఆటోలపై పడ్డాయి. రెండు ఆటోలపై అవి పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.అయితే, లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు.

హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో రెండు బోట్లు, ప్రమాద సమయంలో బోట్స్‌లో 15 మంది

కాగా రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్‌ యోగేంద్ర మద్యం మత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మామునూరు ప్రమాదానికి ముందు లారీ వరంగల్‌ జిల్లా ఐనవోలు మండలం పంథిని శివారు బ్రిడ్జి వద్ద ఎరువుల బస్తాలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ రాజు గాయపడ్డారు.లారీడ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వరంగల్‌ సీపీ, కలెక్టర్‌లను ఆదేశించారు.

Warangal Road Accident

మృతులను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ జిల్లా లలితాపూర్‌కు చెందిన సంతోష్‌ చౌహాన్‌ కుటుంబంగా గుర్తించారు. వీరు రహదారుల పక్కన ఆవాసం ఏర్పరుచుకొని వ్యవసాయ పనిముట్లు, కొడవళ్లు, గొడ్డళ్లు తయారు చేస్తారు. ఆదివారం మామునూరు నుంచి వరంగల్‌కు రెండు ఆటోల్లో బయల్దేరారు. ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు.