TS Rythu Runa Mafi 2021: తెలంగాణలో రూ.25వేల నుంచి రూ.50 వేల లోపు రుణ మాఫీ, రెండు ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ శాఖ, బ్యాంకులు ఈ మొత్తాన్ని ఏ ఇతర బాకీ కింద జమ చేసుకోవద్దని ఆదేశాలు
Image used for representational purpose. | (Photo-PTI)

Hyderabad, August 7: తెలంగాణలో ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్ల మేర పంట రుణమాఫీ (Telangana Rythu Runa Mafi Scheme 2021) డబ్బులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.25వేల నుంచి రూ.50 వేల లోపు పంట రుణాలున్న రైతుల రుణాలను మాఫీ (TS Rythu Runa Mafi 2021) చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50 వేల లోపు రుణాలన్నీ మాఫీ చేయాలని, బ్యాంకులు ఈ మొత్తాన్ని ఏ ఇతర బాకీ కింద జమ చేసుకోవద్దని ఆదేశించింది.

ఆ సొమ్మును పూర్తిగా పంట రుణమాఫీ కిందే జమ చేయాలని స్పష్టం చేసింది. రుణమాఫీ జరిగిన రైతుల ఖాతాలను జీరో చేసి, కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. అంతకు ముందు ఇదే అంశంపై 42 బ్యాంకుల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి బీఆర్కే భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రూ.50 వేలలోపు రైతు రుణమాఫీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.

గురువారం నుంచే దళిత కుటుంబాల అకౌంట్లలో రూ. 10 లక్షలు జమ, వాసాలమర్రిలో వరాలు కురిపించిన సీఎం కేసీఆర్, గ్రామంలో కలియదిరుగుతూ సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ

ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్‌ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణమాఫీని ప్రకటిస్తారన్నారు. అదే రోజు నుంచి ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్లు జమ అవుతాయన్నారు. రుణమాఫీ సొమ్ము జమ కాగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ వెళ్లాలని ఆదేశించారు. రైతు రుణమాఫీతో పాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని.. ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనాలని సూచించారు. బ్యాంకులు సైతం రైతులకు రుణమాఫీ అయినట్లు స్పష్టమైన సందేశం పంపాలన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం చేరవేయాలని కోరారు.