CM KCR Tour Highlights: గురువారం నుంచే దళిత కుటుంబాల అకౌంట్లలో రూ. 10 లక్షలు జమ, వాసాలమర్రిలో వరాలు కురిపించిన సీఎం కేసీఆర్, గ్రామంలో కలియదిరుగుతూ సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ
CM KCR during his visit to Vasalamarri Village, Yadadri Dist. | Photo: FB

Yadadri, August 4: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తాను దత్తత తీసుకున్న గ్రామం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ బుధవారం పర్యటించారు. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు గురువారం నాటికి దళిత బంధు పథకం కింద రూ. 10 లక్షలు జమ చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు గ్రామ కాలనీల్లో సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు కాలినడకన పర్యటించిన సీఎం కేసీఆర్,  అక్కడ దళిత వాడల్లో కలియదిరిగారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరి యోగక్షేమాలను, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.  దళిత బందు పథకం గురించి తెలుసా అని అడిగి తెలుసుకున్నారు. ఇంటికి పది లక్షలు వస్తే ఏం చేస్తారు? దళిత బంధు డబ్బులు వస్తే ఏం చేద్దాం అని అనుకున్నారు అని సీఎం ప్రశ్నించారు?  కొంత మంది మిల్క్ డైరీ ఫాం పెట్టుకుంటామని కొందరు ట్రాక్టర్ లు కొంటామని, మరికొందరు వ్యాపారాలు చేసుకుంటామని సీఎంకు తెలిపారు.  ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరిస్తూ మీకు పెన్షన్ వస్తున్నదా అని ఆరా తీసారు.  పెన్షన్ వస్తుందా? 24 గంటల కరెంట్ వస్తుందా? సాగు నీళ్ళు వస్తున్నాయా? రైతు బంధు డబ్బులు వస్తున్నయా? ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు అని సీఎం ఆయా కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధుల దగ్గర వెళ్ళి పెన్షన్ లో కొంత ఏమైనా  పొదుపు చేసుకుంటున్నరా అని ఆరా తీసారు.  పెన్షన్ రానివాళ్ళు ఏవరైనా ఉంటే వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు.

దళిత కుటుంబాలతోపాటు ఇతర కాలనీల్లో కూడా సీఎం పర్యటించారు. ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని దిగులు పడవద్దని సీఎం వారికి భరోసానిచ్చారు. నిరుపేద మహిళలు వృద్ధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఇండ్లు రోడ్డకు దిగువన ఉండటంతో వర్షం వచ్చినప్పుడు మొత్తం నీటితో నిండిపోతున్నాయని పలువురు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నందున కాలనీల రోడ్లు, డ్రైనేజీలు ఒక ప్లాన్ ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్ ను ఆదేశించారు. తమకు పెన్షన్ రావడం లేదని విన్నవించిన సుమారు 20 మంది బీడీ మహిళా కార్మికులకు రెండు రోజుల్లో వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ ను ఆదేశించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్పబోతుండగా.. ‘‘నేను బీడీలు చేసేటోళ్ళ ఇంటిలో ఉండే చదువుకున్నా వాళ్ళ కష్టాలు నాకు తెలుసమ్మా’’ అని సీఎం వాఖ్యానించారు.

Tweets by TS CMO:

ఒక దళిత కుటుంబం ఇంటి దగ్గర ఆగినప్పుడు వాళ్ళు తమ కూతురుకి ఏదైనా సహాయం చేయాలని సీఎంకు విన్నవించగా అల్లుడు డ్రైవర్ గా పని చేస్తాడు అని చెప్పడంతో దళిత బంధు కింద అతనికి ట్రాక్టర్ ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోపలికి వెళ్లిన సమయంలో పక్కనే వున్న ప్రజా కవి, ఎమ్మెల్సీ  గోరేటి వెంకన్నను చూపిస్తూ ఈయన మీకు తెలుసా దళిత నాయకుడు ‘‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’’ అని పాట రాసింది ఈయనే అని సీఎం వారికి పరిచయం చేశారు.

గ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు పట్టాలు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దత్తత గ్రామమైనందున అన్ని కుటుంబాల వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తామని సీఎం వారికి హామి ఇచ్చారు.

ముఖ్యమంత్రి వెంట శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునీత ఎమ్మెల్సీ  గోరేటి వెంకన్న, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, సీఎం ఓస్డీ దేశపతి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.