Vigilance DG Rajeev Ratan (Credits: X)

ఉగాది పండుగ వేళ తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ విజిలెన్స్‌​ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఓ ప్రైవేట్‌ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు.తెలంగాణ విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు రాజీవే సారధ్యం వహించారు. గుండెపోటుతో విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్‌ కన్నుమూత

సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన విశిష్టమైన సేవలందించారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదు. రాజీవ్ రతన్ మృతి పట్ల నా సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని సీఎం రేవంత్‌ సంతాప ప్రకటన విడుదల చేశారు.

Here's CMO Tweet

రాజీవ్‌ రతన్‌ 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్‌. గతంలో కరీంనగర్‌ ఎస్పీగా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. కిందటి ఏడాది మహేందర్‌రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన టైంలో.. కొత్త పోలీస్‌ బాస్‌ రేసులో ఈయన పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత ఆయన విజిలెన్స్‌ డీజీగా ప్రమోషన్‌ పొందారు.

కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై విజిలెన్స్‌ డీజీ హోదాలో రాజీవ్‌ రతన్‌ విచారణ జరిపారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది.