Hyd, Dec 12: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (Bhadradri Kothagudem district ) దారుణ హత్య జరిగింది. ఇచ్చిన అప్పు తీర్చమన్నందుకు.. ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్ ని అత్యంత కిరాతకంగా కాళ్లూ, చేతుల నరాలు కట్ చేసి (Software engineer brutally murdered ) చంపారు. ఈ దారుణ ఘటన టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్‌రోడ్ పంచాయతీ కార్యాలయంలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన ధారావత్ అశోక్‌కుమార్ (24) ఖమ్మంలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య అమల, రెండు నెలల పాప ఉన్నారు.
ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌కు చెందిన గుగులోత్ ప్రేమ్‌కుమార్‌కు అవసరమైనప్పుడు అశోక్ అప్పు ఇచ్చేవాడు. అలా ప్రేమ్‌కుమార్ రూ.80 వేల వరకు అశోక్ దగ్గర తీసుకున్నాడు. అంతేకాకుండా.. తన స్నేహితుడికి కూడా అశోక్ దగ్గర అప్పు ఇప్పించాడు. డబ్బులు తీసుకొని చాలా కాలం కావడంతో.. అశోక్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని అశోక్ ఇద్దరినీ అడిగాడు. పదేపదే డబ్బులు అడుగుతుండటంతో కక్ష పెంచుకున్న వారిద్దరూ.. అశోక్‌ను చంపాలని అనుకున్నారు.
అందులో భాగంగా.. శనివారం రాత్రి డబ్బులిస్తానని ఆశోక్‌ను ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌కు రావాలని ప్రేమ్‌కుమార్ చెప్పాడు. దాంతో అశోక్ తన బైక్‌పై అక్కడకు ఒంటరిగా చేరుకున్నాడు. అప్పటికే తన స్నేహితుడితో అక్కడకు చేరుకున్న ప్రేమ్ కుమార్.. అశోక్‌ను స్థానిక పంచాయతీ కార్యాలయంలోకి తీసుకువెళ్లి గొంతు, చేయి, కాలి నరాలు కట్ చేసి దారుణంగా హత్య చేశారు.
మరుసటి రోజు ఉదయం వరకు అశోక్ ఇంటికి రాకపోవడంతో.. ఆయన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పంచాయతీ కార్యాలయంలో శవం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడకు వెళ్లిన పోలీసులు మృతుడిని అశోక్‌గా గుర్తించారు. అశోక్ తండ్రి బాలాజీ ఫిర్యాదుతో టేకులపల్లి పోలీసులు.. ప్రేమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అశోక్‌కు ఏడాది కిందటే వివాహం అయ్యింది. నెలల పాప ఉంది. దీంతో ఒళ్లో పసికందుతో అశోక్ భార్య కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది. అశోక్‌ను చంపిన వాళ్లను శిక్షించి.. తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతోందామె. తన భర్తను దూరం చేసి.. చిన్న వయసులో తన జీవితాన్ని ఇలా మార్చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, పోలీసుల వల్ల కాకపోతే తమ ఎదుటకు తీసుకొస్తే తామే శిక్షిస్తామని ఆక్రోశంతో నిండిన ఆవేదనను వెల్లగక్కింది ఆమె.
ఇదిలా ఉంటే.. హత్యపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని అంటోందామె. ఒక్కడి వల్లే ఈ హత్య సాధ్యం కాదని, ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తోంది. గ్రామస్థులు కూడా అశోక్ శారీరకంగా ధృడమైన మనిషిని అని, ప్రతిఘటించే అవకాశం కావడంతో.. ఈ హత్యలో తమకూ అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఈ హత్యకు గ్రామంలో ఉండే గంజాయి బ్యాచ్‌కు సంబంధం ఉందన్న భావిస్తున్నారు వాళ్లు. మరోవైపు ఇది రూ. 80 వేల వ్యవహారమేనా? హత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.