Hyd, April 18: కని పెంచిన తల్లికి సపర్యలు చేయలేక ఓ కసాయి కొడుకు ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా పూడ్చి పెట్టాడు. పైగా తన తల్లి కనబడటం లేదంటూ పోలీసులుకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయం బయటపెట్టడంతో జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ సీఐ రామన్ తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్‌కు చెందిన ఇట్టవోయిన బాలవ్వ(80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెకు సపర్యలు చేయడం భారంగా భావించిన కుమారుడు బాలయ్య.. ఈనెల 13న తల్లికి చీర కొంగుతో ఉరి బిగించి చంపాడు. అనంతరం రాత్రి వేళలో గ్రామ శివారుకు తీసుకెళ్లి ఖననం చేశాడు.ఈనెల 13నుంచి తల్లి బాలవ్వ కనిపించడం లేదని, ఆమె పడుకున్న గదికి గొళ్లెం పెట్టి ఉందని ఊళ్లోవాళ్లకు చెప్పాడు.దీంతో పాటు తన తల్లి కనిపించడం లేదని స్థానిక సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
బాలయ్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడని సీఐ రామన్ తెలిపారు. అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న తల్లికి సేవలు చేయలేక చీరతో ఉరి బిగించి చంపానని, అదే రోజు రాత్రి మృతదేహాన్ని గ్రామ శివారుకు తీసుకువెళ్లి ఖననం చేశానని అంగీకరించాడని వెల్లడించారు.తల్లిని చంపిన బాలయ్యపై కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. వృద్దాప్యంలో సేవ చేయాల్సి వస్తుందని కన్న తల్లినే అతి దారుణంగా చంపిన ఈ దుర్మార్గున్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.