
Hyd, June 15: తెలంగాణ రాష్ట్రంలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన గ్రీన్ యాపిల్ అవార్డులను వివిధ విభాగాల్లో యాదాద్రి ఆలయం సహా ఐదు నిర్మాణాలు దక్కించుకున్నాయి. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కాగా, ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
ఈ నెల 16న లండన్‌లోని జరగనున్న కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ అవార్డులను అందుకుంటారు. అవార్డులకు ఎంపికైన వాటిలో యాదాద్రి ఆలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం, మోజంజాహీ మార్కెట్ ఉన్నాయి.రాష్ట్రం ఇప్పటికే వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డ్(2022), ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్(2021), లివింగ్, ఇన్‌క్లూజన్ అవార్డ్-స్మార్ట్‌సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్(2021) వంటి ప్రపంచస్థాయి అవార్డులను సొంతం చేసుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, పునరుద్ధరించిన ఐదు నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకోవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. గ్రీన్ యాపిల్ అవార్డులు అందుకోనుండడం గొప్ప విషయమని అన్నారు. దేశంలోనే తొలిసారి గ్రీన్ యాపిల్ అవార్డులను దక్కించుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం రాష్ట్రంతోపాటు దేశానికీ గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని రాజీలేకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలతో, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా కట్టడాల నిర్మాణం, పునరుద్ధరణ జరుగుతున్నదని వివరించారు. సకల జనుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదని, మనం ఆచరిస్తున్న ప్రగతిదారులను దేశం అనుసరిస్తున్నదన్నారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాజా అవార్డుల నేపథ్యంలో ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, సిబ్బందిని కేసీఆర్ అభినందించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో తెలంగాణ టాప్ : సీపీ గ్రామ్ నివేదిక
ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంలో తెలంగాణ దేశంలోనే మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. గతంలోనూ అద్భుత పనితీరును నమోదుచేసిన తెలంగాణ తాజాగా మే నెలలోనూ ఉత్తమ ప్రదర్శనను కనబరిచింది.
రాష్ట్రం 2,524 పిటిషన్లను అత్యల్పంగా ఎనిమిది రోజుల్లోనే పరిష్కరించింది. లక్షద్వీప్ 12 రోజుల వ్యవధిలో 171 పిటిషన్లను పరిష్కరించి రెండోస్థానంలో ఉండగా, అండమాన్ నికోబార్ 442 పిటిషన్లను 20 రోజుల సగటుతో పరిష్కరించి మూడోస్థానంలో నిలిచింది. 15 వేలలోపు పిటిషన్లు ఉన్న రాష్ర్టాలను గ్రూప్-డీ క్యాటగిరీలో చేర్చారు.
గ్రూ ప్-డీ క్యాటగిరీలో తెలంగాణ 72.49 స్కోర్‌తో తొలిస్థానంలో నిలవగా.. ఛత్తీస్‌గఢ్ 55.75 స్కోర్‌తో రెండోస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ అట్టడుగున పదో స్థానంతో సరిపెట్టుకున్నది