Hyderabad, March 11: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha )పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయనుంది. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మహిళా కమిషన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించనుంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని డీజీపీ( DGP )ని మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది.
మరోవైపు కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆమెకు మద్దతుగా నగరంలోని పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు పలు చోట్ల దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో ఆందోళనకు దిగారు. వెంటనే సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని.. కవితకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దిల్లీలో కవిత విచారణ, నగరంలో బీఆర్‌ఎస్ ఆందోళనల దృష్ట్యా నగరంలోని బషీర్‌బాగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి తాళాలు వేసి.. పోలీసులు భారీగా మోహరించారు.