Nirmal, June 16: నిర్మల్ జిల్లా బాసర (Basara) రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT-Triple IT)లో విద్యార్థుల ఆందోళన మూడో రోజుకు చేరింది. మెయిన్ గేటు ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో విద్యార్థులు గేటు వైపు దూసుకు రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆర్‌జీయూకేటీ రెండో గేటు ఎదుట విద్యార్థులు బైఠాయించారు. మద్దతుగా వచ్చిన విద్యార్థుల కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 12 డిమాండ్లతో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
మేమేమైనా రాజకీయ నాయకులమా? మాకు రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది..? ఇది మీ యూనివర్సిటీ కాదా! మేం మీ విద్యార్థులం కాదా! సమస్యలను పరిష్కరించాలని అడిగే హక్కు కూడా మాకు లేదా?’ అంటూ బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్‌ఐటీ) విద్యార్థులు ఆందోళన (IIIT Basara Students Protest) కొనసాగించారు. ‘కలెక్టర్ వస్తే.. విద్యాశాఖ మంత్రి చెబితే మా సమస్యలకు శాశ్వత పరిష్కారం తీరుతుందన్న నమ్మకం పోయింది. సీఎం లేదా మంత్రి కేటీఆర్ వర్సిటీకి రావాలి, రెగ్యులర్ వీసీని నియమించాలి, మాకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలి. ఇవే మా ప్రధాన డిమాండ్లు. ఇవి తీరే వరకు వెనకడుగు వేసేది లేదని స్పష్టంచేశారు.
ఎనిమిది వేల మంది విద్యార్థులంతా తరగతులను బహిష్కరించి వర్సిటీలో నెలకొన్న సమస్యలపై గొంతెత్తారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద రోజంతా బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వర్షంలో తడుస్తూనే కదలకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేశారు. సోషల్ మీడియా వేదికగానూ వేల మంది విద్యార్థులు తమ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హమీ ఇచ్చినా.. వైస్ చాన్సలర్‌తో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా విద్యార్థులు మాత్రం పట్టు వీడటం లేదు. మాటలు చెప్పొద్దని.. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని సోషల్ మీడియా వేదికగా మంత్రులకు విద్యార్థులు ఘాటైన సమాధానాలిచ్చారు.
నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ.. అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి ఆర్జీయూకేటీకి వెళ్లారు. కొందరు విద్యార్థులతో చర్చలు జరిపారు. మంత్రి సబితారెడ్డితో మాట్లాడించారు. ప్రస్తుతం విద్యార్థులు చెబుతున్న 12 డిమాండ్లలో రెండు, మూడు తక్షణమే పరిష్కరిస్తామని, మిగితావి ఇప్పట్లో చేయలేమని చెప్పారు. ఇందుకు విద్యార్థులు ఒప్పుకోలేదు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సీఎం లేదా మంత్రి కేటీఆర్ వచ్చేదాకా తాము వెనకడుగు వేసేది లేదని స్పష్టంచేశారు.
ఆర్జీయూకేటీ విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ చెప్పారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. బాసర పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల సందర్భంగా విద్యార్థులను బెదిరించినట్లు వచ్చిన వార్తలు సరికాదన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, విద్యార్థులు గురువారం నుంచి యథావిధిగా తరగతులకు హాజరవుతారన్నారు. అయితే, తమ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేదాకా ఆందోళన ఆపేదిలేదని విద్యార్థులు తెగేసి చెప్పడం గమనార్హం.