Hyderabad, July 30: భార్యాభర్తల (Wife-Husband) బంధం ఎంతో గొప్పది. అన్యోన్య దాంపత్యం కలిగిన దంపతులను మృత్యువు కూడా విడదీయలేదు అంటారు. ఇదీ అలాంటి ఘటనే. చనిపోయిన భర్త జ్ఞాపకాలను ఓ చెట్టులో (Tree) చూసుకుంటూ ఏటా జయంతి చేస్తున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి. సోమవారం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఓ చెట్టుకు చనిపోయిన తన భర్త డ్రెస్ వేసి, కొమ్మలకు బెలూన్లు కట్టి, అందంగా అలంకరించి వినూత్నంగా చెట్టుకు పుట్టినరోజు, భర్తకు జయంతిని నిర్వహించారు ఆమె.
అసలేం జరిగిందంటే?
ఎనిమిదేండ్ల క్రితం విజయలక్ష్మి భర్త వెంకటయ్య జబ్బు పడ్డారు. కోలుకోవడం కష్టమని గ్రహించిన ఆయన తన ఇంటి ఎదుట మొక్క నాటారు. మొక్క నాటిన కొద్దిరోజుల్లోనే ఆయన మరణించారు. అయితే, భర్త మరణానంతరం విజయలక్ష్మి ఆ మొక్కను జాగ్రత్తగా పెంచుతున్నారు. ఆ మొక్క ఇప్పుడు చెట్టయ్యింది. ఏటా కుటుంబసభ్యులతో కలిసి ఆ చెట్టుకు బెలూన్స్ కట్టి పుట్టినరోజు వేడుక నిర్వహిస్తున్నారు ఆమె. అయితే, ఇంతలోనే ఆమె ఊహించని పరిస్థితి ఎదురైంది.
చెట్టును వేరేచోటుకి తరలించి..
నేషనల్ హైవే వెడల్పులో భాగంగా విజయలక్ష్మి ఇంటి ముందున్న చెట్టును తొలగించాలని అధికారులు ప్రయత్నించారు. దీంతో ఆ చెట్టు వెనుక కథను ఆమె అధికారులకు వివరించారు. దీంతో ఆమె విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొన్న అధికారులు చెట్టు చనిపోకుండా జాగ్రత్తగా తరలించడానికి ఒప్పుకున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల అనుమతితో, అధికారుల సహకారంతో ఆ చెట్టును జేసీబీ సహాయంతో తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలోకి తీసుకెళ్లి నాటారు ఆమె. దీంతో ఆ చెట్టుకు పూజలు చేసి, పంచభక్ష పరమాన్నాలు పెట్టి వేడుక నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.