Hyderabad, June 23: తెలంగాణలో కోవిడ్ సెకండ్ వేవ్ దాదాపు నియంత్రణలోకి వచ్చేసింది, ఇప్పుడు లక్షకు పైగానే టెస్టులు చేస్తున్నప్పటికీ రోజూవారీ కేసులు 15 వందల లోపే ఉంటున్నాయి. అయితే, దేశంలో థర్డ్ వేవ్ అనివార్యంగా కనిపిస్తుంది. రాబోయే థర్డ్ వేవ్‌ను ఎదుర్కోనేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా భాగంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మరియు అనుబంధ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్ వేవ్‌లో కరోనావైరస్ యొక్క అత్యంత కఠినమైన స్ట్రెయిన్ "డెల్టా ప్లస్" వేరియంట్ విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. వ్యక్తుల్లో డెల్టా ప్లస్ వేరియంట్ లక్షణాలు మరియు చైన్ ను విచ్ఛిన్నం చేయటానికి అర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వాడుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పట్నించే అన్ని రకాలుగా సన్నద్ధమవుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన కమాండ్ కంట్రోల్ ను జూన్ 26 న ప్రారంభించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక, రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,24,907 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,175 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 820 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,15,574కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 133 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,
ఖమ్మం నుంచి 76, కరీంనగర్ నుంచి 74, నల్గొండ నుంచి 70 మరియు భద్రాద్రి కొత్తగూడెం నుంచి 70 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 10 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,586కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 1771 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,95,348 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,640 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.