
Hyd, April 15: తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె మహాలక్ష్మి(27) గురువారం తెల్లవారుజామున సారపాకలోని స్వగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు (TRS Former Mla's Daughter Ends Life ) పాల్పడ్డారు. ఇంట్లోని ముందు గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న మహాలక్ష్మిని ఆమె వ్యక్తిగత సహాయకురాలు గమనించి, ఇరుగుపొరుగు సహకారంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిన వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి దమ్మపేటకు చేరుకుని అక్కడి నివాసంలో ఉండిపోయారు. వెంకటేశ్వర్లు భార్య రత్నకుమారి గతంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడు రవికుమార్ హైదరాబాద్‌లో ఉన్నారు. కరీంనగర్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన మహాలక్ష్మి పీజీ ప్రవేశపరీక్షకు ( Failing Pg Med Exam) సిద్ధమవుతున్నారు. 15 రోజులుగా మహాలక్ష్మి ముభావంగా ఉంటోందని, పీజీ ప్రవేశపరీక్ష సమీపిస్తున్నందున ఆందోళనకు గురవుతోందని భావించానని తండ్రి వెంకటేశ్వర్లు (Thati Venkateshwarlu) తెలిపారు.
స్థలం మారితే మంచిదని బంధువుల ఇంటికి పంపించానని, రెండు రోజులకు తిరిగొచ్చి మామూలుగానే ఉంటున్నట్టు చెప్పారు. ఇంతలోనే తన కుమార్తె అఘాయిత్యానికి పాల్పడిందని కన్నీరుమున్నీరయ్యారు. కాగా, మానసిక ఒత్తిడితోనే మహాలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.