Heavy Rains Alert: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి, అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరికలు; పాపికొండలకు బోటు ప్రయాణం మూడు రోజుల పాటు నిలిపివేత
Image used for representational purpose. | File Photo

Hyderabad, July 13: గత మూడు వారాలుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో బలహీనపడిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు తిరిగి పుంజుకున్నాయి. రుతుపవనాల బలోపేతంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి.

ఇక, బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరం వెంబడి అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనావేసింది.

ఐఎండీ బులెటిన్ లో జూలై 13న తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ సూచికను జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి వికారాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా మరో రెండు, మూడు రోజుల వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.

హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వర్షం కారణంగా నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉంది, రోడ్లపైన వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. చెట్ల కింద మరియు కరెంట్ స్థంభాల వద్ద నిలబడవద్దని స్పష్టం చేశారు.

ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీవర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది, పోలవరం కాఫర్‌డ్యామ్ నుంచి ప్రవహించే బ్యాక్‌వాటర్‌ను దృష్టిలో ఉంచుకుని పాపికొండలకు బోట్ ప్రయాణాన్ని అధికారులు మూడు రోజుల వరకు సస్పెండ్ చేశారు.