Hyderabad, June 20: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తి వేసిన నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసుల సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వీసులు అందుబాటులో (Hyderabad Metro to Operate From 7 AM to 9 PM) ఉంటాయి.
ఉదయం 7 గంటలకు మొదటి ట్రైన్, చివరి స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరుతుంది. మారిన సమయాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం నిబంధనలు పాటించాలని మెట్రో అధికారులు కోరారు.
జీహెచ్ఎంసీలో (GHMC Vaccination) వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ జోరుగా కొనసాగుతోంది. ఎలాంటి భయాలు లేకుండా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. రోజుకి 45 వేల మందికిపైగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు 6 లక్షల 50 వేల మందికి వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సినేషన్ కోసం మొత్తం 60 సెంటర్లను బల్దియా ఏర్పాటు చేసింది. మరోవైపు రేపటి నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకా వేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో అర్ధరాత్రి నుంచి ఆంక్షలు కూడా ఎత్తేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో వాహనాలు యధావిధిగా నడువనున్నాయి. కాగా.. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడస్తాయని ప్రకటించినప్పటికీ.. ఒక్క అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలపై క్లారిటీ రాలేదు.