Cold Wave in Telangana (Photo-ANI)

Hyd, Dec 18: తెలంగాణలో చలి పంజా విసురుతోంది. చలితో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలైంది, ఉదయం 10 గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గలేదు, దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.

హైదరాబాద్‌లోనూ చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అత్యల్ప ఉష్ణోగ్రత 6.2 డిగ్రీలకు పడిపోయింది, పటాన్‌చెరులో 7 డిగ్రీలు, మెదక్‌లో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌ 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో గ్రేటర్‌ పరిధిలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు గ్రేటర్‌లో ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, ఉదయాన్నే బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిక

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు, వికారాబాద్‌ జిల్లా బంట్వారంలో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అటు సంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న జహీరాబాద్‌ మండలం సత్వార్‌లో కనిష్ఠంగా 6.6 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని భీంపూర్‌ మండలం అర్లి(టి)లో అత్యల్పంగా 6.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలి తట్టుకోలేక ప్రజలు చలిమంటలు ఏర్పాటు చేసుకుంటున్నారు.చిన్నపిల్లలు, సీనియర్‌ సిటిజన్లు చలిగాలుల బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

తెలంగాణపై చలిపంజా.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ లో 6.3 డిగ్రీలుగా నమోదు.. 12 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌

ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్నివస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్‌, మెదక్‌ జిల్లా సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత అంతకంతకూ పెరిగింది. 11 నుంచి 12 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రానున్న రెండు రోజులలో చలి పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని సూచనలిచ్చింది.