Hyderabad, March 31: మొన్నటివరకూ వానలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణను (Telangana) మరో నాలుగు రోజులపాటు ఎండలు మండేలా చేయనున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి ఏప్రిల్ (April) మూడో తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు (Temperature Rises) పేర్కొంది. సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు తెలిపింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ జిల్లాల్లో యెల్లో అలర్ట్
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ యెల్లో అలర్ట్ హెచ్చరికను వాతావరణశాఖ జారీ చేసింది. ఆయా జిల్లాలో వాతావరణాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించింది.