Hyderabad, DEC 04: ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం (Burra Venkatesham) స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆయన టీజీపీఎస్సీ చైర్మన్‌గా (TGPSC Chairman) గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్నారు. ఇటీవల బుర్రా వెంకటేశంను టీజీపీఎస్సీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించగా.. ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ప్రస్తుత చైర్మన్, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి (Mahender reddy) పదవీకాలం ముగియగా.. ఆ స్థానంలో వెంకటేశంను నియమించింది. బుర్రా వెంకటేశం 1995 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. ఆయన సర్వీస్ 2028 ఏప్రిల్ 10 వరకు ఉన్నది. ఇంకా మూడున్నరేళ్ల పదవీకాలం ఉండగానే వీఆర్‌ఎస్ తీసుకున్నారు.
ఈ నెల 2న వీఆర్ఎస్ (VRS) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఆయన ఏప్రిల్, 2030 వరకు పదవిలో ఉంటారు. బుర్రా వెంకటేశం స్వస్థలం జనగామ జిల్లా ఓబుల్ కేశవపురం. నారాయణగౌడ్, గౌరమ్మ దంపతులకు జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన.. ఇంటర్‌లో హైదరాబాద్‌లో చదువుకున్నారు. ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదువుకుంటూ హోం ట్యూషన్స్ చెప్పారు. 1990లో తొలి ప్రయత్నంలోనే సివిల్స్ రాసిన ఆయన.. సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో కొలువు సాధించారు. మళ్లీ 1995లో సివిల్స్ రాసిన జాతీయ స్థాయిలో 15వ ర్యాంక్, ఉమ్మడి ఏపీలో టాప్ ర్యాంక్ సాధించారు. 1996లో ఆదిలాబాద్ జిల్లా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా చేరారు. ఆ తర్వాత వరంగల్ సబ్ కలెక్టర్‌గా, చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా, ఉమ్మడి ఏపీలో మెదక్, గుంటూరుతో పాటు వివిధ జిల్లాలకు కలెక్టర్‌గా సేవలందించారు. అలాగే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు ప్రాజెక్టు డైరెక్టర్‌గా, ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా, స్టేట్ టూరిజం డిపార్ట్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పని చేశారు.