Hyderabad November 18: వడ్ల కొనుగోలుపై కేంద్రంపై యుద్ధానికి దిగారు తెలంగాణ సీఎం కేసీఆర్. మా వడ్డు కొంటారా? కొనరా? చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతులను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహాధర్నాలో సీఎం కేసీఆర్‌తో పాటూ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘ఈ గోల్ మాల్ గాళ్లకు, ఈ గోల్ గుండం గాళ్లకు కరెంట్ ఉన్న వాడలేని అసమర్థులకు, దేశంలో నీళ్లు ఉన్న ప్రజలకు ఇవ్వలేని అసమర్థులకు చరమగీతం పాడితినే ఈ దేశానికి నిష్కృతి. కచ్చితంగా జెండా లేవాల్సిందే. దేశ వ్యాప్తంగా ఉద్యమం రగలాల్సిందే. ఈ విషయాలు దేశంలో ప్రతి ఇంటికి చేరాల్సిందే. మరో పోరాటానికి తెలంగాణ ఇవాళ నాయకత్వం వహించాల్సిందే. మనం సిద్ధం కావాల్సిందే. మన సమస్యలకు పరిష్కారం మన దగ్గర్నే దొరకదు. చిప్ప పట్టుకుంటే దొరకదు. బతిమాలిడితే దొరకదు. బిచ్చమెత్తుకుంటే దొరకదు. ఈ దేశ ప్రజలు బిచ్చగాళ్లు కాదు. మనం కూడా బిచ్చగాళ్లం కాదు. పండించాం.. దేశానికి అన్నం పెడుతామంటే తీసుకునే తెలివి లేక ఇవాళ గోల్ మాల్ చేస్తున్నారు. ఆరాచకం సృష్టిస్తున్నారు. ఈ కిరికిరి పెట్టి, గోల్ మాల్ చేస్తున్నారు. దేశం మూగబోతోంది. మాట్లాడితే మీ మీద కేసులు పెడుతాం. దా పెట్టుదా.. ఏం పెడుతావో పెట్టు’ అని కేసీఆర్ సవాల్ చేశారు.
మా ఓపికకు ఓ హద్దు ఉందన్నారు సీఎం కేసీఆర్. ప్రధానిని చేతులు జోడించి ఒకటే మాట అడుగుతున్నా.. వడ్లు కొంటారా? కొనరా?. దీనిపై ఆయనకు నిన్న లేఖ రాశా. దేశంలోని రైతు సమస్యలపై టీఆర్‌ఎస్ నాయకత్వం తీసుకుంటుందన్నారు. ధాన్యం కొంటామని ఇప్పటి వరకు కేంద్రం హామీ ఇవ్వలేదన్నారు. యాసంగిలో ధాన్యం వద్దని చెబితే వేయాలని బీజేపీ అంటోంది. కేంద్రం ధాన్యం తీసుకోకపోతే దిష్టితీసి బీజేపీ కార్యాలయంపై కుమ్మరిస్తామని హెచ్చరించారు. దేశ రైతుల సమస్యల పరిష్కారం కోసం నేతృత్వం వహిస్తామన్నారు. రాష్ట్ర సాధనలో పదవులను తృణప్రాయంగా వదులుకున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మత విద్వేషాలు రెచ్చగొట్టి కాలం గడుపుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ వంటి నాటకాలు బయటికొచ్చాయి.. ప్రజలకు తెలిశాయన్నారు.
ఇందిరాపార్క్ వద్ద టీఆర్‌ఎస్ మహాధర్నా ముగిశాఖ టీఆర్‌ఎస్ మంత్రులు బస్సులో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఎంపీ కేశవరావు నేతృత్వంలోని బృందం 10 మంది మంత్రులు,10 ఎంపీలు గవర్నర్నర్‌ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు.