Hyd, April 27: రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థను.. ఇప్పుడు దుర్మార్గంగా మార్చేశారని సీఎం కేసీఆర్ ఆక్షేపించారు. హైదరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీలో (TRS Plenary Meeting 2022) ఆయన ప్రసంగిస్తూ.. మహారాష్ట్రలో కీలకమైన ఓ ఫైల్‌ను అక్కడి గవర్నర్ ముందుకు కదలనీయకుండా దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు. తమిళనాడులోనూ ఓ బిల్లు విషయంలో అదే పరిస్థితి. మహారాష్ట్ర, బెంగాల్, కేరళ, తమిళనాడు.. ఇలా ఏ రాష్ట్రం చూసినా గవర్నర్‌ల పంచాయితీ చూస్తున్నాం.
దివంగత ఎన్టీఆర్.. పార్టీ పెట్టినప్పుడు మేమూ ఆయనతో పని చేశాం. అద్భుతమైన మెజార్టీతో ఆయన అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా ఇదే దుర్మార్గమైన రీతిలో గవర్నర్ వ్యవస్థను ఉపయోగించి.. స్వచ్ఛమైన పాలన అందించిన ఎన్టీఆర్‌ను (NTR) సీఎం పీఠం నుంచి దించేశారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఇదెక్కడో భారత రామాయణ గాథలు నుంచి చెప్తోంది కాదు. ఇదే హైదరాబాద్ గడ్డపైన జరిగింది. తామే గొప్పనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.. మెడలు వంచి ఎన్టీఆర్‌ను మళ్లీ సింహాసనం మీద కూర్చోబెట్టారు తెలుగు ప్రజలు. ఎన్టీఆర్‌తో దుర్మార్గంగా వ్యవహరించిన ఆ గవర్నర్ ఏమయ్యాడు?.. చివరకు తొలగించబడ్డాడు.. అవమానకర రీతిలో రాష్ట్రం విడిచి వెళ్లిపోయాడు.
జరిగిన చరిత్రే కదా. దాని నుంచైనా బుద్ధి రావొద్దా? ఇది చూసైనా ప్రజాస్వామ్యంలో పరిణితి నేర్చుకోవద్దా?. కానీ, ఇప్పుడేం జరుగుతోంది?.. ఉల్టా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వక్రమార్గంలో.. రాజ్యాంగబద్ధమైన ఒక పదవిని దుర్వినియోగపరుస్తున్నారు అంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్. : దేశంలో మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్న పార్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ దేశానికి కావాల్సింది కత్తుల కొట్లాటలు, తుపాకుల చప్పుళ్లు కాదు.. కరెంట్, సాగునీరు, తాగునీరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అని కేసీఆర్ స్పష్టం చేశారు. జాతిపిత గాంధీని దూషణలు చేస్తున్నారు.
ఏ దేశం కూడా ఇలాంటి దూషణలు చేయదు. ఇదేం దుర్మార్గం.. స్వాతంత్ర్యం కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని దుర్భషలాడటమా? ఆయనను చంపిన హంతకులను పూజిచండమా? ఇది సంస్కృతా? ఇది పద్ధతా? ఎందుకు ఈ విద్వేషం. ఏం ఆశించి దీన్ని రగుల్చుతున్నారు. ఏ రకమైన మత పిచ్చి లేపుతున్నారు. మత విద్వేషాలు మంచిది కాదు. కుటిల రాజకీయాలు చేసి, పదవుల కోసం విధ్వంసం చేయడం తేలికనే. అదే కట్టాలంటే ఎంత శ్రమ అవసరం అని కేసీఆర్ ప్రశ్నించారు.
మన పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించిందని కేసీఆర్ గుర్తు చేశారు. అక్కడ 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలున్నాయి. పరోక్షంగా మరో 30 లక్షల మంది బతుకుతున్నారు. దీని వెనుకాల ఎంతో కృషి ఉంది. కానీ ఇటీవల కాలంలో హిజాబ్, హలాల్ జరుగుతుందీ ఆ రాష్ట్రంలో. కులం మతం పేరుతో దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు. అమెరికాలో మనోళ్లు 13 కోట్ల మంది ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
వారు మీరు మా మతస్తులు, కులస్తులు కాదు అని పంపిస్తే ఈ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తదా? మత విద్వేషాలను రెచ్చగొట్టే ఈ దేశం ఉద్యోగాలను ఇస్తదా? ఇది ఎవరికీ మంచిది కాదు. దీని వల్ల ఏం సాధిస్తారు. దేశం అన్ని రంగాల్లో నాశనమై పోయింది. పోయినా సర్కారే మంచిగా ఉండే అని మాట్లాడుతున్నారు. నిరుద్యోగం పెరిగింది. ఆకలి పెరిగింది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. నిత్యావసరల ధరలు పెరుగుతున్నాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. ఇన్నీ సమస్యలతో దేశం సతమతమవుతుంటే.. దీనిపై దృష్టి పెట్టకుండా.. విద్వేషం, ద్వేషం ఒక పిచ్చి దేశానికి లేపి రాజకీయ పబ్బం గడుపుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
పుల్వామా, సర్జికల్ స్ట్రైక్స్, కశ్మీర్ ఫైల్స్ అంటూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఇదేమీ దౌర్భాగ్యం. ప్రేమతో, అనురాగంతో. సోదరభావంతో ఉజ్వలమైన భారత్‌ను నిర్మించాలి. పిచ్చి కొట్లాటలతో నష్టపోతున్నామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో దేవుని పేరుమీద జరిగే ఊరేగింపులో కత్తులు, తుపాకులతో చెలరేగిపోయారు. ఈ భారతదేశమేనా మనకు కావాల్సింది. మహాత్ముడు కలలగన్నది ఈ దేశమేనా? ఇదేనా ప్రజలు కోరుకునేది. కత్తుల కొట్లాటలు ఎవరికి కావాలి. కావాల్సింది కరెంట్, సాగునీరు, మంచినీళ్లు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు. వాటన్నింటిని పక్కకు పెట్టేసి, మతం, కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
ఈ దేశం ఇట్లనే నాశనం కావాల్నా. లేదు టీఆర్ఎస్ గా మనం కూడా ఒక పాత్ర పోషించాల్నా? మన శక్తిని ప్రదర్శించి ఈ దుర్మార్గాన్ని నిలువరించి ఒక మార్గాన్ని చూపెట్టాల్నా.. ఇలాంటి ప్రశ్నలు మన ముందున్నాయని కేసీఆర్ తెలిపారు. ఈ దేశానికి కావాల్సింది రావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు (not political fronts or regrouping) కాదు.. ఇవేం సాధించలేవు.. ఇవాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా (India needs alternative agenda). ఒక అద్భుతమై ప్రగతి పథంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్రతిపాదిక పడాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.