Hyd, Oct 11: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) నిప్పులు చెరిగారు. మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని కేటీఆర్ (KTR) తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తరు. మోదీ, బోడీ, నీ ఈడీ మా వెంట్రుక కూడా పీకలేరు. ఏం చేసుకుంటవో చేసుకోపో. చావనైనా చస్తాం.. నీకు మాత్రం లొంగిపోయే ప్రసక్తే లేదు.
తప్పు చేయనోళ్లు ఎవరికీ భయపడరు. ఆరోపణలు మోదీ మీద వచ్చాయి. శ్రీలంక దేశంలో అక్కడి ప్రభుత్వ పెద్దలు, విద్యుత్ రంగ సంస్థ అధిపతి.. మోదీ మీద ఆరోపణలు చేశారు. రూ. 6 వేల కోట్ల కాంట్రాక్ట్ గౌతం అదానీకి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నీకు నీతి, సిగ్గు, మానం ఉంటే దాని మీద వివరణ ఇవ్వండి. అది వాస్తవమా? కాదా? చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలన్నారు.
దేశం ఒక వైపు పేదరికంలోకి పోతోంది. నిరుద్యోగం పతాక స్థాయికి చేరింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. 8 ఏండ్లలో మోదీ చేసిందేమీ లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. పేదలున్న దేశంగా భారత్ మారింది. ధనవంతులే ధనవంతులుగా మారిపోతున్నారు. ఒక అదానీ, రాజగోపాల్ రెడ్డి ధనవంతులైతే ఈ దేశ ప్రజల భాగ్య రేఖలు మారిపోతాయా? అని ప్రశ్నించారు. మన తెలంగాణ మోడల్‌ను దేశానికి చూపేందుకే భారత్ రాష్ట్ర సమితి అని పెడుతున్నాం.
బరాబర్ పరిచయం చేస్తాం. గుజరాత్ మోడల్‌తో దేశాన్ని గోల్‌మాల్ చేసినప్పుడు , బ్రహ్మాండంగా పని చేస్తూ, పేదవారికి అండగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, భారత్ రాష్ట్ర సమితి ఎందుకు కావొద్దు. ఇక్కడ ఎవరెవరో రాజకీయం చేయొచ్చు. కానీ తెలంగాణ వారు బయటకు వెళ్లి రాజకీయం చేయొద్దా? తెలంగాణకు చేసినట్లే.. దేశంలోని ఇతర ప్రాంతాలకు మన అభివృద్ధిని విస్తరిద్దాం. బలంగా గులాబీ జెండాను ఇతర ప్రాంతాల్లో నాటుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను కట్టెబట్టిన మాదిరిగానే.. మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇవ్వండి.. పోటీ నుంచి తప్పుకుంటామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ విషయంలో మంత్రి జగదీశ్ రెడ్డి నిన్న చేసిన మాటలకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కట్టుబడి ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అవగాహన పెంచుకోవాలి. ప్రజలకు వివరించాలని కేటీఆర్ సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక కేవలం ఒక్క కారణంతోనే వచ్చింది. ఒక కాంట్రాక్టర్ బలుపు కారణంగానే వచ్చింది. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి, ఆయనను లోబర్చుకుని, అవసరమైతే రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే, మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొంటానని నరేంద్ర మోదీ అహకారం ప్రదర్శించారు. ఆ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికనే మునుగోడు ఉప ఎన్నిక అని కేటీఆర్ స్పష్టం చేశారు.
నిన్న మునుగోడు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి ధనవంతుడైతే ఆ నియోజకవర్గం బాగుపడదు. రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్ట్‌లు కట్టబెట్టినట్లే.. నల్లగొండ జిల్లా అభివృద్ధికి రూ. 18 వేల కోట్లు ఇస్తే.. పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. మా మంత్రి ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కట్టుబడి ఉంటాం. మాకు నియోజకవర్గం అభివృద్ధి కావాలి. ఒక్క సీటో, రెండో సీట్లతోనూ ఫరక్ పడేది లేదు. 105 సీట్లతో సభలో ప్రజల ఆశీర్వాదంతో ఉన్నామని కేటీఆర్ తెలిపారు.
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు కోమటిరెడ్డిలు కాదు.. కోవర్టు రెడ్డిలు అని కేటీఆర్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను మోదీ తన బుట్టలో వేసుకున్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
మిషన్ భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ మెచ్చుకుని, ఈ పథకాన్ని దేశం మొత్తం అమలు చేయండని కేంద్రానికి సూచించింది. మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతున్న మునుగోడు ప్రజల కోసం రూ. 19 వేల కోట్లు ఇవ్వమంటే మోదీకి మనసు ఒప్పలేదు. కానీ కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డికి మాత్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు.
ఇక అన్నదమ్ముళ్లను బుట్టలో వేసుకున్నారు. ఈయనేమో బీజేపీలోకి జొర్రిండు. అన్ననేమో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారట.. ఎలక్షన్ అయిపోయాక తిరిగి వస్తడట. అన్న కాంగ్రెస్ ఎంపీ, ఈయనేమో బీజేపీలో జొర్రిన నేత. వీళ్లిద్దరూ కోమటిరెడ్డిలు కాదు.. కోవర్ట్ రెడ్డిలు. కోవర్ట్ ఆపరేషన్లు చేసేటోళ్లు వీరు. ఈ చిల్లర రాజకీయాన్ని మునుగోడు ప్రజలకు తెలియజెప్పాలి. గల్లిగల్లీకి, ఇంటింటికీ ఈ విషయాన్ని చెప్పాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
రాజగోపాల్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నీకు బీజేపీ అప్పనంగా రాసిచ్చిన మాట వాస్తవం కాకపోతే.. కాంట్రాక్ట్‌ను వదులుకో. న్యాయ వ్యవస్థ మీద మాకు కొంత నమ్మకం ఉంది. దమ్ముంటే ఆ పని చేయ్. నేను ఆ పని చేయను. వేల కోట్లు ఎలా వదులుకోవాలి అనుకుంటావా..? భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద బండి సంజయ్ నెత్తి మీద చేయి పెట్టి ప్రమాణం చేయ్. కాంట్రాక్ట్‌తో సంబంధం లేదని ఈ గుండు సాక్షిగా చెబుతున్నానని చెప్పు. లేదా మేం కట్టిన యాదాద్రికి వచ్చి మోదీ మీద ప్రమాణం చేయ్ అని కేటీఆర్ సవాల్ విసిరారు.
ఈ బఫూన్ గాళ్లతో కొట్లాడటం పెద్ద కష్టమేం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలతోనే కొట్లాడినొళ్లం.. వీళ్లతోని ఎంత? అని అన్నారు. మునుగోడు యుద్ధంలో డబ్బులతో నాయకులను కొంటున్నారు. మనం నమ్ముకోవాల్సింది కేవలం ప్రజలను మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు.