MLC Elections : తెలంగాణలో ఎన్నికలు లేకుండానే ఆరు చోట్ల టీఆర్ఎస్ విజయం, ఏపీలో 11 స్థానాలు ఏకగ్రీవం, శాసన మండలిలో 32కు చేరనున్న వైసీపీ బలం..
Representative Image (Photo Credits: File Photo)

తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముగిసింది. మొత్తం 12 స్థానాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌గా.. ఇందులో 6 స్థానాలు ఏక‌గ్రీవ‌మ‌య్యాయి. మ‌రో 6 స్థానాల‌కు డిసెంబ‌ర్ 10న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. నిజామాబాద్ నుంచి క‌ల్వ‌కుంట్ల క‌విత‌, రంగారెడ్డి నుంచి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వ‌రంగ‌ల్ నుంచి పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 1, న‌ల్ల‌గొండ 1, మెద‌క్ 1, ఖ‌మ్మం 1, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు డిసెంబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్నాయి. ఆదిలాబాద్ నుంచి దండె విఠ‌ల్, న‌ల్ల‌గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఖ‌మ్మం నుంచి తాతా మ‌ధు, మెద‌క్ నుంచి డాక్ట‌ర్ వంటేరి యాద‌వ‌రెడ్డి, క‌రీంన‌గ‌ర్ నుంచి భానుప్ర‌సాద్ రావు, ఎల్ ర‌మ‌ణ బ‌రిలో ఉన్నారు.

ఇక ఏపీ శాసన మండలిలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ బలం 32కు చేరనుంది. 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలనూ వైసీపీ కైవసం చేసుకుంది. అనంతపురం జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో టి. వెంకట శివ నాయుడు తన నామినేషన్‌ను ఉపసహరించుకున్నారు. అన్ని ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలోకి వెళ్లడంతో మండలిలో ఆ పార్టీ బలం 32కు చేరనుంది.