Hyderabad, August 3: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు (Telangana Covid-19 Update) కాస్త తగ్గుముఖంపట్టాయి. నిన్న 9,443 మందికి కరోనా పరీక్షలు (Covid-19 Tests) నిర్వహించగా, 983 మంది పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసులు (TS Corona Cases) 67,660కు చేరాయి. ఇందులో 48,609 మంది కోలుకోగా, 18,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 11,911 మంది బాధితులు ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. బీజేపీ అగ్రనేతల్లో కరోనా కలవరం, బి.ఎస్.యడ్యూరప్పకు కరోనా పాజిటివ్, దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు, హోమంత్రి అమిత్ షాకు కోవిడ్-19 పాజిటివ్
కరోనాతో నిన్న కొత్తగా 11 మంది (TS Corona Deaths) మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో వైరస్ వల్ల ఇప్పటివరకు 551 మంది మృతిచెందారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 273 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 73 కేసులు ఉన్నాయి.
తెలంగాణ రాజధాని నుంచి గ్రామాల్లోకి కరోనావ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 270 మండలాలు, 1500 గ్రామాల్లోకి కోవిడ్ మహమ్మారి అడుగుపెట్టినట్లుగా రిపోర్టులు చెబుతున్నాయి. వైరస్ వ్యాప్తి ఇదే రీతిలో కొనసాగితే ఆగష్టు నెల ముగిసే నాటికి రాష్ట్రంలోని మరో 5 వేల గ్రామాల్లో వైరస్ చేరే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ అంచనా. దీంతో పల్లె ప్రాంతాల్లో కరోనా కట్టడికి పటిష్టమైన చర్చలు చేపట్టాలని ఆరోగ్య శాఖ ప్రభుత్వాన్ని కోరింది. భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నారాయణపేట, నిర్మల్, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మాత్రమే కోవిడ్ కేసుల సంఖ్య కాస్త తక్కువగా ఉంటోంది. మిగతా జిల్లాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 129 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 2078కి చేరింది. ప్రస్తుతం జిల్లాలో 1532 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటి వరకూ మొత్తం 61 మంది మృతి చెందారు.
తాజాగా కరీంనగర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. అలాగే డ్రైవర్‌కు, ఇద్దరు గన్‌మెన్లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నారదాసు లక్ష్మణ్ కుటుంబం హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
హైదరాబాద్‌లో ఓ వృద్ద దంపతులు కరోనా సోకిందేమోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖైరాతాబాద్‌లో ఉన్న రాజీనగర్‌లో ఎడమ వెంకటేశ్వరరావు(63),వెంకటలక్ష్మి(60) అనే వృద్ద దంపతులు నివసిస్తున్నారు. గత 10 రోజులుగా వీరు దగ్గు,జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కరోనా సోకిందేమోనని ఇద్దరూ భయాందోళనకు గురయ్యారు. ఇదే క్రమంలో శనివారం(అగస్టు 1) ఇంట్లోనే కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూసైడ్ నోట్‌లో ఈ వివరాలను పేర్కొనట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఏపీలోనూ కరోనా టెస్టుల సంఖ్య 20 లక్షలు దాటింది. కానీ తెలంగాణలో మాత్రం ఆగష్టు 2 నాటికి 4.77 లక్షల టెస్టులు మాత్రమే చేశారు. ఏపీలో కరోనా బాధితుల సంఖ్యతో పోలిస్తే తెలంగాణలో బాధితుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. కానీ టెస్టులు పెంచితే ఇక్కడ కూడా భారీగా కేసులను గుర్తించొచ్చని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు మరో 4-5 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను తెప్పిస్తున్నట్లు ప్రకటించింది.