High Court of Telangana| Photo Credits: Wikimedia Commons

Hyderabad, Sep 8: కరోనా మూడోవేవ్ ముంచుకొస్తోందని, ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై (Corona in TS) విచారణ సందర్భంగా మూడోవేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని పేర్కొంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు కోర్టుకు నివేదిక సమర్పించారు.అయితే, ప్రభుత్వ స్పందనపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి. వినోద్ కుమార్ తో కూడిన ధర్మాసనం (TS High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదని వ్యాఖ్యానించింది. ఇప్పటికే కరోనాతో (Coronavirus in TS) చాలా మంది చనిపోయారని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా నష్టం జరగకుండా చూడాలని సూచించింది. చాలా రాష్ట్రాల్లో మూడో వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని, అక్కడ కేసులు పెరిగిపోతున్నాయని గుర్తు చేసింది. తాము ఆదేశించినా ఇంతవరకు నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించలేదని, వారంలోగా కమిటీ భేటీ అయి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించింది.

జనగామ, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండల్లో కేసుల పాజిటివిటీ రేటు ఒకశాతం కన్నా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల చికిత్స కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది. ఈ ఆదేశాలనైనా అమలు చేయాలని, లేదంటే కోర్టుకు రావాల్సి ఉంటుందని డీహెచ్, కేంద్ర నోడల్ అధికారిని హెచ్చరించింది.

తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక

గణేష్‌ విగ్రహాల నిమజ్జనం విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలన్న తమ ఆదేశాలపై ప్రభుత్వ స్పందన సరిగా లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిమజ్జనం సమయంలో ఆంక్షలు, నియంత్రణల చర్యలపై తామిచ్చే ఆదేశాలను చూపించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే చేద్దామని భావించినా..ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించింది. జల, వాయు కాలుష్యం నియంత్రణకు చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుందని వ్యాఖ్యానించింది. విచారణకు కొన్ని నిమిషాల ముందు ఉదయం 10.25 నిమిషాలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రిజిస్ట్రీలో నివేదిక సమర్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నగర పోలీసు కమిషనర్‌కు నివేదిక సమర్పించే తీరిక కూడా లేనట్టుందంటూ మండిపడింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీవోపీ)తో చేసిన భారీ గణేష్‌ విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్‌ కాలుష్య కాసారంగా మారుతోందని, వీటి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఇచి్చన సూచనల అమలు బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది. కరోనా, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వినాయక మండపాల ఏర్పాటు సమయంలో గుమిగూడకుండా, నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై తగిన ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పును రిజర్వు చేసింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం విధించాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఇచి్చన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది.

కొన్ని నిమిషాల ముందు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ కుమార్‌ నివేదిక సమర్పించారని, మరికొన్ని నిమిషాల్లో నగర పోలీసు కమిషనర్‌ నివేదిక సమర్పిస్తారని ప్రభుత్వ న్యాయవాది నివేదించడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు దాఖలు చేసిన నివేదిక పరిశీలించే అవకాశం లేదని, నగర పోలీసు కమిషనర్‌కు నివేదికే ఇచ్చే సమయం కూడా లేదా అని మండిపడింది.