తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నెల 25న విడుదల చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను (TS Inter Results 2022) ఈనెల 25న విడుదల చేసేందుకు ఇంటబోర్డు కసరత్తు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే.. మూల్యాంకన ప్రక్రియ మొత్తం పూర్తయినందున తప్పులు రాకుండా సాఫ్ట్‌వేర్ ద్వారా పరిశీలిస్తున్నారు. అన్నీ సజావుగా జరిగితే.. జూన్ 25న ఫలితాలు (TS Inter Results 2022) విడుదల చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఒకవేళ 25న కుదరకపోతే 29వ తేదీ అయినా ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయని సమాచారం. త్వరలో ఈ అంశంపై స్పష్టత రానుంది.
. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మే 24న పూర్తయ్యాయి. పరీక్షలు పూర్తైన 20 రోజుల్లో ఫలితాలు (TS Inter Results 2022) విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు గతంలో ప్రకటించింది. దీంతో జూన్ 15న ఫలితాలు విడుదలవుతాయని వార్తలొచ్చాయి. అంతకుముందు జూన్ 10న ఫలితాలు విడుదల చేయొచ్చన్న ప్రచారం జరిగింది. అనంతం తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. జూన్ 15న ఫలితాలు విడుదల చేయట్లేదని స్పష్టం చేసింది. జూన్ 20 లోపు ఫలితాలు విడుదల చేస్తామని గతంలో ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. జూన్ 20 కూడా దాటిపోయింది. జూన్ 25న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలవుతాయని తాజాగా మళ్లీ వార్తలొస్తున్నాయి.
మే 28 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. అయితే.. మూల్యాంకన ప్రక్రియ మొత్తం పూర్తయినందున తప్పులు రాకుండా సాఫ్ట్‌వేర్ ద్వారా పరిశీలిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఈ క్రమంలో జూన్ 25న ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ గతంలోనే ప్రకటించారు. ఇక.. ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణలో మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్మీడియర్ పరీక్షలు రాశారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. వారంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రతీసారి కొత్త తేదీ తెరపైకి వస్తుండటంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన 15 రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది ఇంటర్ బోర్డు. ఫలితాలు విడుదల చేసే రోజే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ షెడ్యూల్‌తో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తేదీలను ప్రకటించనుంది ఇంటర్ బోర్డు