London: తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూకేలో పర్యటిస్తోంది. తెలంగాణ ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీని ఇంగ్లండ్ చెందిన సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఇంగ్లాండ్‌లో సర్ఫేస్ మేజర్ మెంట్ సిస్ట్ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కంపెనీ ప్రతినిధులు తమ ప్రణాళికలు, పరిశోధనలను కేటీఆర్‌కు వివరించారు.
తెలంగాణలో ప్రగతిశీల, పారిశ్రామిక అనుకూల విధానాల తమ అత్యాధునిక లాబొరేటరీ ఏర్పాటుకు కారణమని సర్ఫేస్ మేజర్ మెంట్ సిస్టమ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్ తెలిపారు. ఏడువేల చదరపు మీటర్ల వైశాల్యంతో. హైదరాబాద్‌లో ఈ లాబొరేటరీ ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్‌లో ఔషధాల తయారీలో కీలకమైన ఫార్మాసుటికల్ పౌడర్.. క్యారెక్టరైజేషన్‌పై పరిశోధనలు జరగుతాయి.
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు ఈ ల్యాబొరేటరీ వేదిక కానుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ ల్యాబ్‌ను మరింత విస్తరించే ఆలోచనలో సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్ ప్రకటించింది. ఇక తమ లాంటి కంపెనీల పెట్టుబడులకు ఇండియా ఆకర్షణీయ గమ్యమని సంస్థ పేర్కొంది. పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీ భారతదేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కలిపి పనిచేస్తుందన్నారు.
ఈ ల్యాబ్‌తో తెలంగాణ ఫార్మా రంగం ప్రతిష్ట అంతర్జాతీయంగా మరింత పెరుగుతుందన్నారు. హైదరాబాద్ ఫార్మారంగంలో ప్రవేశించబోతున్న సర్ఫేస్ మేజర్ మెంట్ సిస్టమ్స్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా.. అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్‌లో ల్యాబ్ ఏర్పాటుచేయడం ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు ఉన్న తిరుగులేని ఆధిపత్యానికి నిదర్శనమన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్‌కు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఇందులో భాగంగా లండన్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు భారతీయులు, యూకే టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 26 వరకు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ యూకేలోని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు, వాణిజ్యవేత్తలతో సమావేశమవుతున్నారు. అనంతరం 22 నుంచి 26వ తేదీ వరకు దావోస్‌లో నిర్వహించే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో మంత్రి పాల్గొంటారు. ఈ నెల 18నుంచి 21వ తేదీవరకు నాలుగురోజులపాటు కేటీఆర్ యూకే ప్రపంచస్థాయి కంపెనీల అధిపతులతో వరుసగా భేటీ కానున్నారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించే రెండు రౌండ్‌టేబుల్ సమావేశాల్లోనూ ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ఇక్కడి మౌలిక సదుపాయాల గురించి వారికి వివరిస్తారు.
ఆ తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు.ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ ప్రసంగించనున్నారు. తిరిగి ఈ నెల 26న రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారుల బృందం ఉన్నారు.