GHMC Link Roads: గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్, నిత్యం రద్దీగా ఉండే ఐటీ కారిడార్ పరిధిలో 5 లింక్ రోడ్ల ప్రారంభం, మరో 22 లింక్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడి
GHMC Link Roads | Photo: Twitter

Hyderabad, June 29: గ్రేటర్ హైదరాబాద్‌లో దశాబ్దాల నాటి ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ లింక్ రోడ్లు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులకు కనెక్టివిటి పెంచడంతో పాటు రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు నగరంలో రూ. 313.65 కోట్ల‌తో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామ‌ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి జోన్ పరిధిలో రూ. 27.43 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 లింక్ రోడ్లను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని, దేశంలోని మరే మెట్రో నగరాల్లో లేనివిధంగా హైదరాబాద్‌లో లింక్ రోడ్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

నగరాభివృద్ధికి ర‌హ‌దారులు చాలా ముఖ్యమ‌ని, అభివృద్ది సూచికలుగా నిలిచే రహదారుల అభివృద్దిలో భాగంగా రూ. 6 వేల కోట్ల వ్యయంతో ఎస్ఆర్డిపి ప్రాజెక్టు మరియు రూ. 1800 కోట్ల వ్యయంతో సిఆర్ఎంపి ప్రాజెక్టుల ద్వారా పలు నగరంలోని రహదారుల అభివృద్ది, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం ముమ్మరంగా జరుగుతున్నాయని వెల్లడించారు.

హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే 16 లింకు రోడ్ల‌ను పూర్తి చేశామ‌ని, వీటితో హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ స‌మ‌స్య త‌గ్గుతుందని కేటీఆర్ చెప్పారు. త్వ‌ర‌లోనే మ‌రో 6 రోడ్ల‌ను పూర్తి చేస్తామ‌ని అన్నారు. హైద‌రాబాద్ పెరుగుతున్న జ‌నాభా, జ‌న సాంద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ర‌హ‌దారుల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. అంతేగాక‌, హైద‌రాబాద్ రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ కింద అద‌నంగా మొద‌టి ద‌శ‌లో రూ. 313.65 కోట్ల‌తో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామ‌ని చెప్పారు. ద‌శ‌లవారీగా మొత్తం 133 లింకు రోడ్లు నిర్మిస్తున్నామ‌ని వివ‌రించారు.

సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధిస్తోంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ‌లో అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు.