TS Police Recruitment 2022: తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు శుభవార్త, రాష్ట్ర పోలీసు శాఖ‌లో ఖాళీగా ఉన్న 16,027 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
CM KCR (Photo-ANI)

తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు వ‌రుస‌గా శుభవార్త‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌న్నింటినీ భ‌ర్తీ చేస్తామ‌ని సీఎం కేసీఆర్ (CM KCR) అసెంబ్లీ సాక్షిగా కీలక ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ఆయా ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి తెలంగాణ (Telangana) ఆర్థిక శాఖ వ‌రుస‌గా అనుమ‌తులు మంజూరు చేస్తూ వ‌స్తోంది. తాజాగా రాష్ట్ర పోలీసు శాఖ‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి ఇదివ‌ర‌కే ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ద‌క్క‌గా..సోమ‌వారం నాడు ఈ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయ్యింది.

ప్ర‌స్తుతం తెలంగాణ పోలీసు శాఖ‌లో కానిస్టేబుళ్లు, స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల సంఖ్య‌ 16,027గా నిర్ధారిస్తూ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్టుల‌న్నింటినీ భర్తీ చేసేందుకు ఇదివ‌ర‌కే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో ఈ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం మే నెల 2 నుంచి 20 వ‌ర‌కు అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకునే అవ‌కాశం ఉంది. ఇందుకోసం అభ్య‌ర్థులు www.tslprb.inను సంప్ర‌దించ‌వ‌చ్చు.

ఆయా విభాగాల్లో ఖాళీల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఎస్సై పోస్టులు 414

సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 4,965

టీఎస్‌పీఎస్సీ బెటాలియ‌న్ కానిస్టేబుల్ పోస్టులు 5,010

ఏఆర్ కానిస్టేబుల్స్ 4,423

స్పెష‌ల్ పోలీస్ పోస్టులు 390

ఫైర్ విభాగంలో పోస్టులు 610

డ్రైవ‌ర్ పోస్టులు 100