Hyd, Mar 17: తెలంగాణలో పరీక్షల పేపర్ లీక్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) శుక్రవారం గ్రూప్ 1 ప్రిలిమ్స్, AEE , DAO పరీక్షలను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-I ప్రిలిమినరీ పరీక్ష కోసం సవరించిన పరీక్ష తేదీ ఇప్పుడు జూన్ 11న షెడ్యూల్ చేయబడింది. AEE, DAO పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ప్రశ్నపత్రం లీకేజీల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
"ఈరోజు ఉదయం 11:30 గంటలకు కమిషన్ యొక్క ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికను జాగ్రత్తగా పరిశీలించి, కమిషన్ నిర్వహించిన అంతర్గత విచారణ తర్వాత, పై మూడు పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించామని అధికారిక నోటిఫికేషన్ లో తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను 11 జూన్, 2023న మళ్లీ నిర్వహించాలని నిర్ణయించాం. ఇతర పరీక్షల పునః నిర్వహణ తేదీలు త్వరలో తెలియజేయబడతాయని TSPSC ప్రకటనలో తెలిపింది.
గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఏఈఈ, ఫిబ్రవరి 26వ తేదీన డీఏవో పరీక్షలు జరిగాయి. కమిషన్ తాజా నిర్ణయంపై గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఆ ఫలితాలను జనవరి 13వ తేదీ (శుక్రవారం) విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. 503 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జూన్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ తొలుత భావించింది. ఈలోపే లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపడంతో.. ఇప్పుడు అదే జూన్‌లో మళ్లీ రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది.