Hyderabad, Dece,ber 21: తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ముగిసిన అనంతరం కార్మికులంతా ఉద్యోగాల్లో చేరిపోయారు. సమ్మె ముగిసిన అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి (Ashwathama Reddy) కూడా విధుల్లో చేరారు. అయితే ఆయన విధుల్లో చేరిన వెంటనే 6 నెలలు సెలవు కావాలంటూ ఆర్టీసీ యాజమాన్యానికి (TSRTC) లేఖ రాశారు.
అయితే 6 నెలల కాలానికి సెలవులు కావాలంటూ దాఖలు చేసిన అభ్యర్థనను ఆర్టీసీ తిరస్కరించింది. ప్రస్తుతం ఆర్టీసీ (RTC) తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, సంస్థ ఉన్నతికి సిబ్బంది అంతా కలసి శ్రమించాల్సిన అవసరం ఉందని, కాబట్టి 6 నెలల కాలానికి సెలవు మంజూరు చేయలేమంటూ అధికారులు స్పష్టం చేశారు.
దీంతో పాటు వెంటనే విధుల్లో చేరాలంటూ ఆయనకు సూచించారు. ఇక వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మిక నేతలందరినీ వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక ఆర్టీసీలో పనిచేస్తున్న క్రిస్టియన్ ఉద్యోగులకు క్రిస్మస్ పండగ సందర్భంగా అడ్వాన్స్ ఇవ్వనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. అర్హులైన ఉద్యోగులకు డిసెంబర్ 24 లోగా చెల్లించనున్నట్టు ఉత్తర్వు జారీ చేసింది.
రాష్ట్రంలోని ఎంపీలు రూ.కోటి చొప్పున, ఎమ్మెల్యేలు రూ.50 లక్షలు చొప్పున తమ నియోజకవర్గ అభివృద్ధి పథకం నిధుల నుంచి ఆర్టీసీకి అందజేస్తే రూ.వంద కోట్లు సమకూరి తద్వారా 500 కొత్త బస్సులు కొనేందుకు అవకాశం కలుగుతుందని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఈ దిశగా వారు ఆలోచించి, ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీకి అండగా నిలవాలని ఓ ప్రకటనలో కోరారు.