Hyderabad, November 18: రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) ఆరోగ్యం బాగా క్షీణించిందని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొ. కోదండ రామ్ (Kodanda Ram) తెలిపారు. అంతకుముందు ప్రభుత్వం తమను చర్చలకు పిలిచే వరకు దీక్ష చేస్తానని అశ్వత్థామ రెడ్డి గృహ నిర్భంధంలోనే శనివారం నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఆదివారం ఆయన దీక్షను భగ్నం చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలోనూ దీక్ష (Hunger Strike) కొనసాగిస్తానని అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి కోదండ రామ్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ అశ్వత్థామ రెడ్డి ఇలాగే దీక్షను కొనసాగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. అశ్వత్థామ రెడ్డికి బీపీ, షుగర్ ఉన్న కారణంగా అవి ఆయన మూత్ర పిండాలపై ప్రభావం చూపుతాయని, దీంతో వైద్యులు ఆయనకు సైలైన్స్ ఎక్కిస్తున్నారని కోదండ రామ్ వెల్లడించారు, ఆహారం తీసుకుంటేనే ఆయన ఆరోగ్యం బాగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేం, ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంది
ఇక ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కోదండ రామ్ ఖండించారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమం రేపు యధావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పక్షాల వారు పాల్గొని ఎక్కడికక్కడ రోడ్లు నిర్బంధించి నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలుతుందని, ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని కోదండ రామ్ వ్యాఖ్యానించారు.