Image used for representational purpose. TSRTC Buses. | Photo - Wikimedia Commons

Hyderabad, Sep 28: తెలంగాణ, ఏపీ మధ్య అంతర్‌ రాష్ట్ర సర్వీసులను నడిపే విషయంలో ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రకు సోమవారం నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు ప్రారంభం (TSRTC to resume bus services) కానున్నాయి. ఈ మేరకు బస్సులను నడపడానికి తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నుంచి అనుమతి లభించింది. ఆ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి అదే రోజున బస్సులు ప్రారంభమవుతాయని ఆర్టీసీ (TSRTC) ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సులు ప్రారంభమయ్యాయి. వీటితో పాటే కర్ణాటక, మహారాష్ట్ర (Karnataka, Maharashtra) బస్సులకు ప్రభుత్వం అనుమతించింది. కానీ, బెంగళూరుకు నడిపే బస్సుల విషయంలో కొంత ఇబ్బంది తలెత్తడంతో, ఆ రాష్ట్ర ఆర్టీసీ అధికారులతో టీఎస్‌ ఆర్టీసీ అధికారులు చర్చించారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌ గుండా వెళ్లాల్సి ఉండడం, ఆ రాష్ట్రంతో ఇప్పటికీ ఒప్పందం కుదరకపోవడంతో ఇప్పుడే బస్సులు నడపవద్దని ఆర్టీసీ నిర్ణయించింది.

రూట్ వైజ్ క్లారిటీ ఇవ్వాలని కోరిన తెలంగాణ, ఏ రాష్ట్రం ఇలాంటి ప్రతిపాదన ఇవ్వలేదని తెలిపిన ఏపీ, తేలని ఆర్టీసీ వ్యవహారం

బెంగళూరు మినహా ఇతర ప్రాంతాలకు నడుపుకోవాలన్న నిర్ణయం తీసుకోవడంతో 28 నుంచి రెండు రాష్ట్రాలకు బస్సులను ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఏపీతో (Andhra Pradesh) ఒప్పందంపై ఇంకా ఎటూ తేలడం లేదు. కాగా తెలంగాణ ఆర్టీసీ.. ఏపీఎస్ఆర్టీసీకి (TSRTC and APSRTC) మధ్య కిలోమీటర్లు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆర్టీసీ విభజన ఇంకా జరగలేదు. రూట్ల ప్రాతిపదికన బస్సులను నడుపుకుందామని, ఈ దృష్ట్యా ఏపీ నడిపే కిలో మీటర్లను తగ్గించుకోవాలంటూ తెలంగాణ సూచించింది. కానీ, ఏపీ అధికారులు దీనికి ఒప్పుకోవడం లేదు.

తాము 52 వేల కి.మీ తగ్గించుకుంటామని, కావాలంటే తెలంగాణవారు మరో 50 వేల కి.మీ పెంచుకోవాలని సూచించారు. ఇది సమన్యాయం ప్రాతిపదికన ఉంటుందని తెలిపారు. కాగా, ఇది తమకు గిట్టుబాటు కాదని, రూట్ల ప్రాతిపదికన బస్సులను నడుపుకొందామని.. తాము హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బస్సులు నడిపితే.. ఏపీ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులు నడపాలన్న ప్రతిపాదనను తెలంగాణ ముందుకు తెస్తోంది.

ఇరు రాష్ట్రాలు ఎవరి వాదనను వారు వినిపిస్తుండడంతో ఒప్పందం కుదరడం లేదు. ఇదిలా ఉంటే టీఎస్‌ఆర్టీసీ కర్ణాటక, మహారాష్ట్రలతో ఏపీఎస్‌ఆర్టీసీ పేరు మీదే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుందని ఏపీ స్పష్టం చేస్తోంది. తెలంగాణ మాత్రం రెండు రాష్ట్రాల కార్యకలాపాలు వేర్వేరుగా జరుగుతున్నాయి కాబట్టి.. సాంకేతికంగా అడ్డు పెట్టినా కుదరదని టీఎస్‌ఆర్టీసీ వాదిస్తోంది. కాగా తెలంగాణలో ఇతర రాష్ట్రాలతో అంతర్‌ రాష్ట్ర ఒప్పందం ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీ పేరు మీదే ఉంది.