Hyderabad, DEC 07: మనం కొట్లాడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (bandi Sanjay) అన్నారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీ (BJP) గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టీవీలు చూపిస్తున్నాయని నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్ మూడో స్థానానికి, రేవంత్ రెడ్డి పదో స్థానానికి పడిపోయారని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డిని సీఎంగా గుర్తించేందుకు ఒప్పుకోవడం లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి కొర్రీలు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలను ఎండగడుతూ హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన నిరసన సభలో బండి సంజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ పై ఆయన నిప్పులు చెరిగారు.
”రైతు రూణమాఫీ కాలేదని వ్యవసాయశాఖ మంత్రి చెప్పారు. సంక్రాంతికి రేవంత్ రెడ్డి కి డెడ్ లైన్ పెడుతున్నాం. ఒక్క కాంగ్రెస్ నేతను గల్లీలో తిరగనీయం. ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారు. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో ఎక్కడా పేపర్ లీక్ కాకుండా ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ బీజేపీ, ప్రధాని మోదీ. 7వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు. పాఠశాలల్లో సమస్యలు పేరుకుపోయాయి.
సంక్షేమ హాస్టళ్లలో ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుందోనని విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులనూ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. పంచాయతీలు అభివృద్ధి చెందాయంటే కారణం కేంద్రంలో ఉన్న బీజేపీనే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం. ముత్యాలమ్మ గుడి, శంషాబాద్ ఆలయాలపై జరిగిన దాడులను భాగ్యనగరం ప్రజలు మరచిపోరు. హైదరాబాద్ మన జాగీరు. నగరం అభివృద్ధి జరిగేది మన పైసలతో, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. భాగ్యనగరాన్ని బంగ్లాదేశ్ గా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నది మోదీ ప్రభుత్వం నిధులతోనే. ఇచ్చే పైసలు కేంద్రానివి. మోదీ పేరు లేకుండా ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేర్లు పెడుతున్నారు. ఇళ్లు నరేంద్ర మోడీ ఇచ్చినవి. ఇందిరమ్మ ఇళ్ల వద్దకు వెళ్ళి అడ్డుకోవాలి. మోదీ ఫోటో పెట్టమని డిమాండ్ చేస్తూ కొట్లాడాలి. మంత్రి వర్గంలో కూడా నక్సల్ భావజాలం ఉన్నవారే. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మూటలు మోసిన వారే నేడు కాంగ్రెస్ పార్టీలోనూ పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కుటుంబానికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయని నేను నిరూపిస్తా. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా నాన్చుతున్నారు” అని బండి సంజయ్ ఆరోపించారు.