Vikarabad, Feb 22: తెలంగాణలో నడిరోడ్డు మీద లాయర్ వామనరావు దంపతుల హత్య మరచిపోకముందే మరో దారుణ హత్య చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ మండలంలో ఈ హత్య జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎంపీపీ భర్త వీరప్ప దారుణ హత్యకు (Vikarabad EX MPP Husband Murder) గురయ్యారు. గర్తు తెలియని దుండగులు వీరప్పను రాళ్లతో దాడి చేసి అతికిరాతకంగా హత్య చేశారు.
ఈ ఘటన పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్లో (Hanmapur Village) చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ దారుణంగా హత్య చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పెద్దేముల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు వాణిశ్రీ భర్త వీరప్పకు, స్థానిక గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులకు మధ్య గత కొంత కాలంగా వివాదం చెలరేగుతోందని అందులో భాగంగానే కక్ష కట్టి ఈ హత్య చేసినట్లు సమాచారం. ఊరడమ్మ గుడి దగ్గర కర్రలతో కొట్టి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అధికార పార్టీకి చెందిన ఇద్దరి నాయకుల మధ్య ఉన్న కక్షల కారణంగా మాజీ ఎంపీపీ భర్త (Vikarabad EX MPP Husband) హత్యకు దారి తీయడంతో స్థానికంగా గ్రామంలో తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్ని కేసు నమోదు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గ్రామంలో జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.