Hyd, Nov 20: యాసంగి వడ్లను కేంద్రం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని ఈ విషయమై రేపు ఢిల్లీ వెళ్లి తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎస్‌తో కలిసి అంతా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, ఎఫ్‌సీఐని కలవాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు మీద మాట్లాడుతామని, బాయిల్డ్ రైస్ కొనేది లేదని చెప్పినట్లు వార్త వచ్చిందన్నారు. అలాగే ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలూకు లేదని, ఎటువంటి సమాధానం కూడా వస్తలేదని అన్నారు. మరి అధికారికమా? కాదా? అడిగి తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నామని, బహుశా రెండు రోజులు పట్టొచ్చని అన్నారు. దాని దరిమిలా తెలంగాణ రైతాంగానికి ఏందనేది విషయాన్ని తెలుపుతామని సీఎం కేసీఆర్ అన్నారు.
విద్యుత్ చట్టాలు తెచ్చి మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు కేసీఆర్. దీనిపై రైతులు చాలా ఆందోళనతో ఉన్నారన్నారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసుకోండి కానీ, అన్ని రాష్ట్రాల్లో మీటర్లు పెట్టాలని ఆదేశించడం సమంజసం కాదని అన్నారు. పార్లమెంట్‌లో విద్యుత్ చట్టం బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలన్నారు. బిల్లు పాస్ కాకుండా లోక్‌సభ, రాజ్యసభలో పోరాడతామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. కృష్ణా, గోదావరిలో నీటి వాటాలు తేల్చాలని పట్టుబట్టారు. నీటి వాటాలు తేల్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాల కోసం ఉద్యమించిన రైతుల్లో 750 మంది వరకు రైతులు మరణించారని, వారి కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని అన్నారు.
ఉద్యమంలో మరణించిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున సాయం అందిస్తామని, కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారంగా అందించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో రైతులపై వేల సంఖ్యలో కేసులు నమోదు చేశారని, రైతులకు మద్దతు తెలిపిన అమాయకులపైనా కేసులు పెట్టారని ఆరోపించారు. ఆ కేసులన్నింటిని ఎత్తివేయాలని అన్నారు.