Telangana Rains: తెలంగాణలో నేడూ, రేపు భారీ వర్షాలు, గత 24 గంటల్లో సగటున 20 సెంటీమీటర్ల వాన, పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, పలువురు మ‌ృతి
Heavy rains. (Photo Credits: PTI)

Hyderabad, August 31: తెలంగాణపై అకాల వర్షాలు (Telangana Rains) విరుచుకుపడ్డాయి. 24 గంటల వ్యవధిలో సగటున 20 సెంటీమీటర్ల వాన (Heavy Rains) కురిసింది. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. యాదాద్రి జిల్లా రాజుపేట మండలం కుర్రారం వద్ద వాగు దాటుతూ ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. వరంగల్‌ నగరంలో ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మురుగునీటి కాల్వలో విగతజీవిగా తేలాడు.

కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం దానపూర్‌ కోలాంగూడ గ్రామానికి చెందిన టేకం డోభి(28) అనే యువకుడు పంగిడిమాదర బుగ్గగూడ వాగులో గల్లంతయ్యాడు. ఆదివారం గల్లంతైన నలుగురి మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. వికారాబాద్‌, వరంగల్‌, జనగామ, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాలు వర్షాలకు చిగురుటాకులా వణుకుతున్నాయి. పలు జిల్లాల్లో పంటపొలాలు, జనావాసాలు వాన నీటమునిగాయి. వాగులు పోటెత్తడంతో లోలెవల్‌ వంతెనలు ప్రమాదకరంగా మారాయి. వరద పరిస్థితిపై ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సూచించారు.

తెలంగాణలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్స, ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పేరిట అమలు కానున్న పథకం, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. అత్యధికంగా 24 గంటల వ్యవధిలో దహెగాం (కుమురం భీం జిల్లా)లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా కొలనుపాకలో 19.4, రాజాపేటలో 15.6, పాలకుర్తి(జనగామ)లో 19, హసన్‌పర్తి(హనుమకొండ)లో 14, సిద్దిపేట జిల్లా నంగునూరులో 16.2, సముద్రాలలో 15.6, కొండపాక, బెజ్జంకిలో 13, భైంసా(నిర్మల్‌)లో 11.8, చందూరు(నల్గొండ)లో 13, జమ్మికుంట(కరీంనగర్‌)లో 11 సెం.మీ.వర్షం కురిసింది. మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణశాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలుచోట్ల చెరువు కట్టలు తెగి వరద నీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలేరు, యాదగిరిగుట్ట మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆలేరు పురపాలక సంఘ కార్యాలయంలోకి వరద చేరింది. రంగనాయక వీధిలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. రేషన్‌ దుకాణంలో బియ్యం తడిసిపోయాయి. వాగు ఉప్పొంగడంతో సిద్దిపేట-ఆలేరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంగపల్లిలో రైతువేదిక నీటమునిగింది.

కరోనా నుంచి కోలుకున్నా ఏడాది తర్వాత మళ్లీ అవే లక్షణాలు, నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు వంటి సమస్యలు ఉన్నట్లు తెలిపిన తాజా అధ్యయనం, ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన కథనం

ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం విశాఖపట్నం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని పేర్కొన్నది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువద్ద ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతూ రుతుపవనాల ద్రోణిలో కలిసిందని తెలిపింది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు (Telangana to receive rain for two days) కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.

అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, సిద్దిపేట, వికారాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీచేసింది. హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీచేస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. బుధవారం సైతం పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీచేసింది.