Hyd, July 18: తెలంగాణను ఇంకా వర్షాల ముప్పు (Weather Update) వీడడం లేదు. నేడు భారీగా, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని (Moderate rainfall in next two days) వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి నిన్న మళ్లీ భూమి ఉపరితలంపైకి వచ్చింది. సాయంత్రానికి ఒడిశా తీరంపై కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు భారీగా, రేపు ఓ మోస్తరుగా వర్షాలు (Telangana Rains) కురుస్తాయని అధికారులు తెలిపారు.
భారీ వర్షాలతో వారం పాటు మహోగ్ర రూపం దాల్చిన గోదావరి (Godavari Floods) క్రమంగా శాంతిస్తోంది. ఎగువన శ్రీరాంసాగర్‌లోకి వరద బాగా తగ్గిపోగా.. దిగువన భద్రాచలం వద్ద గడగడా వణికించి మెల్లగా వెనక్కి తగ్గుతోంది. శనివారం రాత్రి 9 గంటల సమయానికి శ్రీరాంసాగర్‌కు వరద 16 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఎల్లంపల్లికి 1,08,940 క్యూసెక్కులు వస్తోంది. అయితే ప్రాణహిత, కడెం, ఇంద్రావతి ఉపనదులు, ఏజెన్సీ వాగుల్లో ప్రవాహాలు ఇంకా ఉండటంతో.. లక్ష్మిబ్యారేజీ వద్ద 10,94,150 క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీ వద్ద 13,16,500 క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 20,60,131 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీల వద్ద వచ్చింది వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు.
గోదావరి వరదల వెనుక విదేశీ కుట్రలు, తెలంగాణ వరదలసై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులకన్నా తగ్గితేనే మూడో ప్రమాద హెచ్చరికకు ఉపసంహరిస్తారు. అప్పటివరకు లోతట్టు ప్రాంతాలు వరద ముప్పులో ఉన్నట్టే లెక్క. చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో మూడు రోజులుగా విద్యుత్ నిలిచిపోగా.. గోదావరి వరద తగ్గేవరకు పునరుద్ధరించే పరిస్థితి కనిపించడం లేదు. అశ్వాపురం మండలం కమ్మరిగూడెంలోని మిషన్ భగీరథ ఇన్‌టేక్ వెల్ వరద మునిగే ఉండటంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 1,730 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల పంచాయతీ నుంచి ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గోదావరిలో నీటి మట్టం తగ్గే వరకు ప్రజలకు మంచినీటి కష్టాలు కొనసాగనున్నాయి.
గత వందేళ్లలో గోదావరికి వచ్చిన అతిపెద్ద వరదల్లో తాజా ప్రవాహం రెండో అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. 1986 ఆగస్టు 15న భద్రాచలం వద్ద 75.6 అడుగుల వరకు వచ్చిన ప్రవాహం అతిపెద్ద వరదగా రికార్డుల్లో నమోదైంది. కాగా భద్రాచలం వద్ద శనివారం రాత్రి 9 గంటల సమయానికి వరద 22,41,144 క్యూసెక్కులకు, నీటిమట్టం 67.7 అడుగులకు తగ్గింది.
వరద ప్రభావిత జిల్లాల్లో 24 గంటల పాటు పనిచేసేలా ప్రభుత్వం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో మొత్తం 289 వైద్య శిబిరాల్లో ఆదివారం ఒక్కరోజే 11 వేల మందికి చికిత్సలు అందజేసింది. గడిచిన రెండు రోజుల్లో 24,674 మందికి వైద్య సేవలు అందించారు. సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో బాధితులకు వేగంగా వైద్య సేవలందిస్తున్నట్లు ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం బులెటిన్‌ను విడుదల చేశారు. తీవ్ర జ్వరం, తలనొప్పి, నీరసం, కళ్లు ఎర్రబడటం, డయేరియా, ఆకలి మందగించడం వంటి లక్షణాలుంటే వెంటనే సమీపంలోని హెల్త్ క్యాంపులకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రస్థాయిలో వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎలాంటి సమస్యలు వచ్చిన వచ్చినా 24 గంటలు పాటు పనిచేసే హెల్ప్‌లైన్ నంబర్లు 9030227324, 040-24651119కు కాల్ చేయాలని సూచించారు. అలాగే అన్ని జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలి, నీటి ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకున్నట్లు వైద్య మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఆదివారం ఆయన వైద్యశాఖ నిర్వహిస్తున్న వైద్య శిబిరాల ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేశారు.