Hyderabad, June 8: మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు పేరు మీద ఉత్తర తెలంగాణలో మరొక కొత్త జిల్లా ఏర్పాటు చేయడం, లేదా ఏదైనా ఒక జిల్లాను పునర్వ్యవస్థీకరించి దానికి పీవీ పేరు పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. జూన్ 28 న 'తెలంగాణ ప్రైడ్' పీవీ 100వ జయంతి సందర్భంగా, మాజీ ప్రధాని గౌరవార్థం జిల్లా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
గతంలో హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పటికే 33 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మరొ కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే కరీంనగర్- వరంగల్ జిల్లాల పరిధి తగ్గుతుందని అప్పట్లో ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం మొగ్గుచూపలేదు. అయితే హుజూరాబాద్ స్థానం నుంచి ఎమ్మేల్యేగా ఉన్న సీనియర్ లీడర్ ఈటల రాజేంధర్ ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం తదనంతర పరిణామాలతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ ఇక్కడ పీవీ పేరు మీద జిల్లాను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈరోజు జరిగే కేబినేట్ భేటీలో చర్చించే అవకాశం లేకపోలేదు.
ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ మినహాయింపులు ప్రధాన ఎజెండాగా సమావేశం జరగనుంది. జూన్ 10 నుంచి లాక్డౌన్ ఎత్తివేయడంపై ఈరోజు సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు వ్యవసాయం, సాగునీరు, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ లేదా రద్దు తదితర అంశాలపై కూడా కేబినేట్ చర్చించనుంది.