
Hyderabad, March 19: తెలంగాణలో కోవిడ్19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది స్కూల్ విద్యార్థులు కరోనా బారినపడుతుండటంతో సర్వత్రా. ఈ కేసును సు మోటోగా తీసుకున్న రాష్ట్ర హైకోర్ట్, కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ముఖ్యంగా పాఠశాలలు మరియు కళాశాలల్లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా, ప్రతిరోజు నిర్వహిస్తున్న వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని మరియు అంతరాష్ట్ర సరిహద్దుల వెంబడి అలాగే రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు మరియు జనాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో మొబైల్ టెస్టింగ్ వ్యాన్లను అందుబాటులో ఉంచాలని సూచించింది. కరోనా రెండో దశ వ్యాప్తి కట్టడి కోసం ఈ ఏడాది మార్చి 1న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్‌ఓపి మార్గదర్శకాలను కఠినంగా పాటించాలని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది.
స్కూల్ పిల్లలకు కరోనా సోకడం పట్ల మరియు తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ ఎక్కువగా వృథా అవుతుండటం పట్ల గవర్నర్ తమిళిసై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలు మళ్లీ మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 62,972 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 313 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 642 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,02,360కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 47 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 29, నిర్మల్ నుంచి 25, మేడ్చల్ నుంచి 20కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,664కు పెరిగింది.
అలాగే గురువారం సాయంత్రం వరకు మరో 142 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,98,262 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,434 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లలతో పాటు 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు.