Paytm (Photo-ANI)

Mumbai, Feb 09:  ఆర్బీఐ ఘటన మరువక ముందేపేటీఎంకి EPFO నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం, దాని అనుబంధ సంస్థలతో ముడిపడిన క్లెయిమ్‌లను పరిష్కరించేటప్పుడు (EPFO Blocks Paytm Payments Bank) జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EOFO) కీలక ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌, దాని అనుబంధ విభాగాలతో అనుసంధానించిన ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించవద్దని ఫీల్డ్ ఆఫీసర్లకు సూచించింది. ఇందుకు సంబంధించిన క్లెయిమ్‌లను ఫిబ్రవరి 23 నుంచి నిలిపివేయాలని స్పష్టం చేసింది.

దీనిపై అవగాహన పెంచేందుకు వీడియోను రూపొందించి ప్రచారం చేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై జనవరి 31న ఆర్బీఐ కఠిన ఆంక్షలు (RBI restrictions) విధించిన విషయం తెలిసిందే. కొత్తగా డిపాజిట్లు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.ఎన్నిసార్లు హెచ్చరించినా రెగ్యులేటరీ మార్గదర్శకాలను పేటీఎం అనుసరించలేదని, దాని నిర్లక్ష్యం వల్లే కఠిన చర్యలకు దిగాల్సి వచ్చిందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంతేగానీ వ్యవస్థీకృత ఆందోళనలేమీ లేవని ఆర్బీఐ గవర్నర్‌ దాస్‌ వెల్లడించారు.

మీ డబ్బు భద్రంగా ఉంది.. కస్టమర్లకు పేటీఎం భరోసా.. డబ్బులు ఎప్పుడు కావాలన్నా విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టీకరణ

ఈ నెల 29 తర్వాత పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లోని (Paytm Payments Bank) ఖాతాలు, ప్రీ-పెయిడ్‌ సాధనాలు, ఈ-వ్యాలెట్లలో కస్టమర్లు డిపాజిట్లను చేయరాదని, బ్యాంక్‌ కూడా వాటిని అంగీకరించరాదని జనవరి 31న ఆర్బీఐ ఆంక్షలు పెట్టింది. ఇప్పటికే కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపైనా బ్యాంక్‌పై ఆంక్షలుండగా, తాజా పరిమితులతో దాదాపుగా సంస్థ సేవలు నిలిచిపోయినట్టే అవుతున్నది. అయితే ఈ గడువును పొడిగించాలని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ విజ్ఞప్తి చేయగా, ఈ విషయం ఆర్బీఐతోనే తేల్చుకోవాలని మంత్రి సూచించినట్టు సమాచారం.

మరోవైపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్ మంజు అగర్వాల్ బ్యాంక్ కంపెనీ బోర్డుకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఆయన రాజీనామా చేసినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కఠిన ఆంక్షలు విధిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కంపెనీ బోర్డు నుంచి వైదొలగినట్టు జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

గుజరాత్ గిఫ్ట్ సిటీలో పేటీఎం రూ.100 కోట్ల పెట్టుబడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దృష్టి సారించిన One97 కమ్యూనికేషన్స్

ఇక పీపీబీఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా బ్యాంక్ ఆఫ్ అమెరికా, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) మాజీ ఎగ్జిక్యూటివ్ షింజిని కుమార్ గత డిసెంబర్‫లోనే రాజీనామా చేశారని పేటీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2016-17 మధ్య పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈఓగా ఆమె పనిచేశారు. ప్రస్తుతం ఉమెన్ ఫోకస్డ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్ ‘సాల్ట్’ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు

ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేసినా పీపీబీఎల్‌లో మరో ముగ్గురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉన్నారు. వారిలో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరవింద్ కుమార్, అక్స్చేంజర్ ఎండీ పంకజ్ వైష్, పారిశ్రామిక అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మాజీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ ఉన్నారు. పేటీఎం పేరెంట్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ వ్యవహారాల హెడ్ డాక్టర్ శ్రీనివాస్ యనమంద్ర, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ ప్రెసిడెంట్ భావేష్ గుప్తా, పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ, సురీందర్ చావ్లా తదితరులు బోర్డు సభ్యులుగా ఉన్నారు.