New Delhi, Mar 10: మీకు డెబిట్, క్రెడిట్ కార్డులున్నాయా? అయితే వాటిని వెంటనే ఆన్‌లైన్ లావాదేవీల కోసం ఉపయోగించండి. లేకపోతే ఇకపై మీరు ఈ కార్డులతో ఆన్‌లైన్ లావాదేవీలు చేసే అవకాశం ఉండదు. ఒక్కసారి కూడా ఆన్‌లైన్ లావాదేవీల కోసం కార్డులను వినియోగించుకోకపోతే మార్చి 16 నుంచి ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ లావాదేవీలకు ఈ కార్డులు (Credit And Debit Cards Alert) పని చేయవు.
డెబిట్/క్రెడిట్ (Credit, Debit cards) లావాదేవీల భద్రత పెంపులో భాగంగా ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ఈ ఏడాది జనవరి 20న ఓ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాడకంలోలేని డెబిట్/ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయనున్నట్లు తెలిపింది. ఆన్ లైన్ లావాదేవీల కోసం మీ దగ్గరున్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఇప్పటి దాకా వాడకపోయినట్లైతే ఈనెల 16 నుంచి అవి పనిచేయవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
మార్చి 16లోగా వినియోగించని కార్డులను నిరుపయోగం చేయాలని బ్యాంకర్లను కార్డు మంజూరుదారులను ఆదేశించింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(RFID) టెక్నాలజీ ఆధారంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల లావాదేవీలు పెరిగిపోతుండగా..ఈ సేవల్లో ఎలాంటి మోసాలకు తావులేకుండా వినియోగదారుల కోసం RBI అనేక సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాడని కార్డులు పనిచేయవని మరోసారి రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.