Washington, July 21: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాతో (Tesla)పాటు స్పేస్ ఎక్స్ (Space X), ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు (Elon Musk) గట్టిషాక్ తగిలింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గిస్తామని ఎలన్ మస్క్ చేసిన ప్రకటనతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. గురువారం నాస్‌డాక్-100 లో టెస్లా షేర్లు 9.7 శాతం నష్టపోయి 262.90 డాలర్ల వద్దకు చేరుకున్నది. గత ఏప్రిల్ 20 తర్వాత టెస్లా షేర్ భారీగా పతనం కావడం ఇదే మొదటి సారి. దీంతో ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 20.3 బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది. మన కరెన్సీలో రూ.1.64 లక్షల కోట్ల పైమాటే. ప్రస్తుతం ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 234.4 బిలియన్ డాలర్లు. ఇప్పటికీ ఆయన ప్రపంచ కుబేరుడిగానే కొనసాగుతున్నారు.
నాస్‌డాక్-100లో షేర్ల పతనం ఎలన్‌మస్క్‌కు మాత్రమే పరిమితం కాలేదు. గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థల సీఈఓలు, అధినేతలు కూడా తమ వ్యక్తిగత సంపద భారీగా నష్టపోయారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఒరాకిల్ కార్పొరేషన్‌కు చెందిన ల్యారీ ఎల్లిసన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ పేరెంట్ సంస్థ అల్ఫాబెట్ ఇంక్ కో-ఫౌండర్లు ల్యారీ పేజ్, స్టెర్జెయ్ కలిపి 20.8 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద కోల్పోయారు. గురువారం నాస్‌డాక్-100లో ఐటీ ఇండెక్స్ 2.3 శాతం పతనమైంది. ఎలన్‌మస్క్‌తో దాదాపు సమానంగా మిగతా బిలియనీర్లు వ్యక్తిగత సంపద కోల్పోయారన్నమాట.
ఇప్పటికైతే ప్రపంచ కుబేరుడి హోదాలోనే ఎలన్ మస్క్ కొనసాగుతున్నా.. రెండో స్థానంలో ఉన్న ఎల్వీఎంహెచ్ సీఈఓ బెర్నార్డ్ అర్నాల్డ్ వ్యక్తిగత సంపద కంటే కొంచెం మాత్రమే ఎక్కువ. బెర్నార్డ్ అర్నాల్డ్ కంటే ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 33 బిలియన్ డాలర్లు మాత్రమే ఎక్కువ. జూన్ నెలలో పారిస్‌లో ఎల్వీఎంహెచ్ వాటా పతనం కావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడి స్థానంలో ఉన్న బెర్నార్డ్ అర్నాల్ట్‌ను దాటేసి, ఎలన్ మస్క్ అత్యంత కుబేరుడి హోదా సంపాదించారు. జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో టెస్లా నాలుగేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇప్పటికే తగ్గుతున్న లాభాలను నిలువరించేందుకు ఎలన్ మస్క్ చర్యలు చేపట్టారు. ఇక ముందు కూడా అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచితే కార్ల ధరలు తగ్గించక తప్పదన్నారు ఎలన్ మస్క్.