దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాల మధ్య టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టెలికాం గేర్ మేకర్, మొబైల్ సంస్థ ఎరిక్సన్ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు (Ericsson Layoffs) రెడీ అయింది. స్వీడన్‌లో దాదాపు 1400 మంది, పలు దేశాల్లో కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. అంతేకాదు రాబోయే రోజుల్లో వివిధ దేశాల్లో అనేక వేల ఉద్యోగాల కోతలను ప్రకటించవచ్చని వార్తలు వస్తున్నాయి.
ఉత్తర అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించడంతో 2023 చివరి నాటికి ఖర్చులను 880 మిలియన్ డాలర్ల క తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు ఎరిక్సన్ (Telecom networking company Ericsson)ప్రకటించింది.2017లో ప్రత్యర్థుల పటీ, నిర్వహణ వ్యయాలు విపరీతంగా పెరగడంతో 25 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఎరిక్సన్ దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోంది.
కాగా ఎరిక్సన్ ఇటీవల ప్రకటించిన నాల్గవ త్రైమాసిక ఫలితాల్లో ఊహించిన దానికంటే తక్కువగా లాభాలు నమోదైన నెల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తాము వివిధ దేశాల కార్మిక చట్టాలను పరిగణనలోకి తీసుకుని యూనిట్లవారీగా తొలగింపు నిర్ణయం తీసుకుంటామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కార్ల్ మెల్లాండర్ వెల్లడించారు. సర్వీస్ ప్రొవైడర్లకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT)అందించే ప్రముఖ సంస్థలలో ఎరిక్సన్ ఒకటి.