Twitter logo (Photo courtesy: Twitter)

New Delhi, February 8: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్న రైతు ఆందోళన (Farmers Protest) నేపథ్యంలో సోషల్‌ మీడియాపై గుర్రుగా ఉన్న కేంద్రం ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గణతంత్ర దినోత్సవం రోజున ట్రా‍క్టర్‌ ర్యాలీలో హింస తరువాత ట్విటర్‌ ఖాతాలపై మరింత కన్నేసిన సర్కార్‌ ఖలీస్తాన్ సానుభూతి పరులతో లేదా పాకిస్తాన్ లింకులున్న ఖాతాలను బ్లాక్ చేయాలంటూ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు తాజాగా నోటీసు ఇచ్చింది.

రైతుల‌ను రెచ్చ‌గొడుతున్న‌ పాకిస్తాన్ - ఖ‌లీస్తాన్ ట్విట్ట‌ర్ ఖా‌తాల‌ను (Pakistani-Khalistani Accounts) తొల‌గించాల‌ని ట్విట్ట‌ర్ సంస్థ‌ను కేంద్రం కోరింది. 1,178 పాకిస్తాన్ - ఖ‌లీస్తాన్ ట్విట్ట‌ర్ ఖాతాల‌ను తొల‌గించాల‌ని, రైతుల ఆందోళ‌న‌ల‌పై ( Farmers' Protest) త‌ప్పుడు స‌మాచారం చేర‌వేస్తున్న‌ట్లు కేంద్రం తెలిపింది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రెచ్చ‌గొట్టే ట్వీట్లు చేస్తున్నాయ‌ని కేంద్రం పేర్కొంది. ఈ ఖాతాల‌ను తొల‌గించాల‌ని ట్విట్ట‌ర్‌కు కేంద్రం విజ్ఞ‌ప్తి చేసిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం ఆదేశాల‌ను ట్విట్ట‌ర్ సంస్థ పట్టించుకోలేద‌ని తెలుస్తోంది.

కాగా తప్పుడు సమాచారంతో, రైతుల మారణహోమం లాంటి ప్రమాదకర హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్‌ చేస్తున్న 250 ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం ఇటీవల కోరిన కొన్ని రోజుల తరువాత తాజా ఆదేశాలివ్వడం గమనార్హం. హోం మంత్రిత్వ శాఖ నివేదిక మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ ఈనోటీసు లిచ్చింది.

మరో రైతు ఆత్మహత్య, సూసైడ్‌ నోట్‌ రాసి ఉరేసుకుని చనిపోయిన జింద్‌ గ్రామానికి చెందిన కరమ్‌వీర్‌సింగ్‌, రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆత్మార్పణం చేసుకున్నాడని తెలిపిన రైతులు

ఇదిలా ఉంటే ట్విట్టర్‌ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ మహిమా కౌల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలరీత్యా పదవినుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. కౌల్ ఈ జనవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ, బాధ్యతల మార్పిడి సౌలభ్యం కోసం మార్చి వరకు పదవిలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కానీ అనూహ్య రాజీనామా చర్చకు దారి తీసింది. అయితే ఈ వివాదానికి ఆమె రాజీనామాకు సంబంధం లేదని భావిస్తున్నప్పటికీ, కొందరు పెద్దల ఒత్తిడితోనే కౌల్ ముందస్తు రాజీనామా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

కాగా సుమారు మూడు నెలలకాలంగా కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం కొనసాగుతోంది. చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.