
చైనా యాప్‌లపై కేంద్రం తాజాగా మరోసారి కొరడా ఝళిపించింది. భారతదేశంలో టిక్‌టాక్, ఇతర 58 చైనా యాప్‌లపై శాశ్వత నిషేధం (59 Chinese Apps Banne) విధించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతేడాది జూన్‌లో వీటిపై భారత ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించగా.. ఇప్పుడు వాటిని శాశ్వత నిషేధం దిశగా కేంద్రం తాజా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
భారతీయ వినియోగదారులడేటాను అక్రమంగా సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలపై ఆయా సంస్థల వివరణను కేంద్రం కోరింది . ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology (MeitY) గత వారమే నోటీసులు జారీ చేసింది.
వాటి వివరణతో సంతృప్తి చెందని ప్రభుత్వ 59 యాప్‌లను (China Apps) శాశ్వతంగా నిషేధించాలని నిర్ణయించింది. గత ఆరు నెలల్లో ప్రభుత్వం 208 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. గోప్యత, జాతీయ భద్రతా రక్షణకు అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, బైదు, వియ్ చాట్, అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్, క్లబ్ ఫ్యాక్టరీ, ఎంఐ వీడియో కాల్ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం శాశ్వతంగా నిషేధించింది. ఇక గత ఏడాది జూన్‌లో ఆ యాప్‌లు సహా 267 యాప్ లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
తూర్పు లడఖ్ లోని సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు గొడవల్లో అమరులయ్యారు. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దేశ ప్రజల డేటా తీసుకుంటున్న చైనా కంపెనీలపై వేటు వేసింది.