PUBG-Jio Deal Talks: పబ్‌జీ‌పై జియో కన్ను, 50-50 డీల్ కోసం ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు, ఇంకా అధికారికంగా ప్రకటించని రిలయన్స్ జియో
PUBG | Image used for representational purpose only | (Photo Credits: Flickr)

ఇండియాలో నిషేధం విధించబడిన పాపులర్ మొబైల్ గేమ్ పబ్‌జీని (PUBG) భారతీయ వినియోగదారులకు తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ టెలికాం విభాగం జియో (Reliance Jio) పబ్‌జీ కార్పొరేషన్‌తో చర్చలు (PUBG-Jio Deal Talks) జరుపుతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయని, ఇరు సంస్థలు (PUBG Corp, Jio in talks) కొనుగోలు ఒప్పందంపై తీవ్ర కసరత్తుచేస్తున్నాయని అనధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధిన ఒప్పంద సాధ్యాసాధ్యాలను లీగల్ టీం పరిశీలిస్తోందని వార్తలు గుప్పుమంటున్నాయి.

డీల్ ప్రధానంగా రెండు అంశాలపైనే జరుగుతున్నట్టు సంస్థ వర్గాలు అంటున్నాయి. అందులో మొదటిది 50 శాతం చొప్పున ఇరు కంపెనీలూ వాటాలతో పబ్ జీ కార్పొరేషన్ ను ఇండియాలో నిర్వహించడం. ఇక రెండోది నెలవారీ యూజర్ల ఆధారంగా కార్పొరేషన్ కు కొంత మొత్తాన్ని చెల్లించడం. ఈ రెండు అంశాలపై చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. అపారమైన గేమింగ్ మార్కెట్ ఉన్న ఇండియాలో, ఈ విభాగంలోకి కూడా రావాలని రిలయన్స్ భావిస్తున్న వేళ, ఇప్పటికే ఎంతో చొచ్చుకుపోయిన పబ్ జీ అయితే, తొలి అడుగు ఘనంగా వేయవచ్చని సంస్థ భావిస్తోందని సమాచారం.

టెన్సెంట్ గేమ్స్ తో సంబంధాలను తెంచుకున్న పబ్‌జీ కార్పొరేషన్, భారత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పబ్‌జీ మొబైల్ గేమ్ ఉంటుందని వెల్లడి

కాగా, ఈ గేమ్ ను దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ స్టూడియో తయారు చేసింది. చైనాకు చెందిన టెన్సెంగ్ గేమ్స్ చేతిలో ఇది ఉండటంతో, సమాచార చట్టం సెక్షన్ 69 ప్రకారం, పలు యాప్ లపై భారత్ నిషేధించగా, అందులో పబ్ జీ కూడా ఉంది. ఆపై చైనా కంపెనీ నుంచి బ్లూ హోల్ స్టూడియోస్ దూరం కావడంతో ఈ గేమ్ పై ఉన్న క్రేజ్ ను తన సొంతం చేసుకోవాలని జియో రంగంలోకి దిగింది. కాగా, ఈ డీల్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి తాను విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో పబ్‌జీపై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు జియో రంగంలోకి దిగింది.

అయితే దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఇటీవల కరోనా వైరస్ సంక్షోభం, చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, భద్రతా పరమైన కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఏ ప్రకారం పలు చైనా యాప్లను నిషేధించింది. అందులో భాగంగానే పబ్జీని కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.