Mumbai, December 14: డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహాంలో భాగంగా నేటి నుంచి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్ (RTGS) సేవల్ని ఇక 24 గంటలూ అందుబాటులోకి తెస్తున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఇప్పటివరకు ఆర్టీజీఎస్ (RTGS Money Transfer) నిరంతర సేవల్ని కొన్ని దేశాలే అందిస్తున్నాయి.
ఆర్బీఐ తాజా నిర్ణయంతో భారత్ కూడా ఆ దేశాల సరసన నిలిచింది. దీంతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్)లలో రూ.2,000గా ఉన్న కాంటాక్ట్‌లెస్ కార్డు లావాదేవీల పరిమితిని రూ.5,000 పెంచుతున్నట్టు తెలిపింది. జనవరి 1, 2021 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వెల్లడించింది.
ఇప్పటివరకు ఆర్‌టీజీఎస్ సేవలు (Real-Time Gross Settlement System) అన్ని పనిరోజుల్లో కేవలం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజా నిర్ణయంతో 24 గంటల పాటు ఎప్పుడైనా లావాదేవీలు జరుపుకోవచ్చు.
అదిక మొత్తంలో నగదు బదిలీ చేసేందుకు ఆర్టీజీఎస్ వినియోగిస్తుండగా నెఫ్ట్ ద్వారా కేవలం రూ. 2 లక్షల లోపు మాత్రమే నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 2019 నుంచి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ విధానాన్ని అన్ని రోజుల్లో నిరంతర (24X7) సదుపాయాన్ని ఆర్‌బీఐ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే.