భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్1(Aditya-L1) వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని క్లిక్‌మనిపించింది. ఆ వ్యోమనౌకలోని ‘హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్’ (హెచ్‌ఈఎల్1ఓఎస్) ఈ ఘనత సాధించింది. ఈ మేరకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం ఒక ప్రకటన చేసింది. సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌర జ్వాలగా పేర్కొంటారు.
‘కిలోనోవా’ పేలుడుతో భూమిపై జీవం అంతం? ఇంకా ఎన్నేండ్లలో ప్రమాదం ఉన్నదంటే?
హెచ్‌ఈల్1ఓఎస్‌ను గత నెల 27న ఇస్రో ఆన్ చేసింది. ఇది సూర్యుడికి సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చర్యలను శరవేగంగా పరిశీలించి, అధిక రిజల్యూషన్‌లో చిత్రాలను అందిస్తుంది. తాజాగా అది సౌర జ్వాలలకు సంబంధించిన ఇంపల్సివ్ దశను నమోదు చేసింది. దీని ద్వారా.. సూర్యుడిలో విస్ఫోటక శక్తి విడుదల, ఎలక్ట్రాన్ త్వరణం గురించి మరిన్ని వివరాలను అందుబాటులోకి తీసుకురావొచ్చు. ఈ పరికరాన్ని బెంగళూరులో ఇస్రోకు చెందిన స్పేస్ ఆస్ట్రోనమీ గ్రూప్ అభివృద్ధి చేసింది.