Aditya L1: ఆదిత్య–ఎల్‌1 మిషన్ హైలెట్స్ ఇవిగో, పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా రేపే నింగిలోకి ఆదిత్య ఎల్‌-1, సూర్యుడిపై పరిశోధనలే టార్గెట్
Aditya-L1 Mission (Photo-X ISRO)

సూర్యుడి అధ్య‌య‌నం కోసం ఆదిత్య ఎల్‌1(Aditya L1) మిష‌న్‌ను ఇస్రో చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది.రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు.

ఇందుకోసం శుక్రవారం ఉదయం 12.10 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించారు. 23 గంట‌ల 40 నిమిషాల కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిన‌ట్లు ఇస్రో తెలిపింది.ఈ ప్ర‌యోగాన్ని శ‌నివారం ఉద‌యం 11.20 నిమిషాల నుంచి డీడీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో చూడ‌వ‌చ్చు. ఇస్రో త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఈ విష‌యాన్ని చెప్పింది.

రోవర్ ప్రజ్ఞాన్ కొత్త వీడియో ఇదిగో, అమ్మ ఆప్యాయంగా చూస్తుండగా.. పెరట్లో ఆడుకుంటున్న చంటిబిడ్డలా రోవర్‌ ఉంది కదా అంటూ ట్వీట్

కాగా గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించారు.ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్‌ఎల్వీ సీ-57 నింగిలోకి దూసుకెళ్లనుంది.ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌)కు అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ రాజరాజన్‌ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు.

సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్‌ బిందువు–1(ఎల్‌–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1500 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని సందర్శించిన ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌, రేపు ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇదే కావడం విశేషం.కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది.

ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన ‘విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ)తో పాటు సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మాగ్నెటోమీటర్‌ పేలోడ్‌లను అమర్చనున్నారు.

సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్‌, మాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి.ఎల్‌-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.