చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ప్రయాణానికి గౌరవ సూచికంగా కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.ఇందులో భాగంగా చంద్రయాన్-3 ‘మహాక్విజ్’ పేరుతో ఓ ఆన్‌లైన్ ‘క్విజ్’ను ప్రారంభించింది. ఇందులో పాల్గొన్న వారిలో లక్కీ విజేతకు రూ.లక్ష అందజేస్తామని తెలిపింది. దీంతోపాటు వందల మందిని విజేతలుగా ఎంపిక చేసి.. మొత్తంగా రూ.6లక్షలకు పైగా నగదును అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
ఇస్రో (ISRO) భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం (MyGov) రూపొందించిన ఈ పోటీలో భారత పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను https://isroquiz.mygov.in రూపొందించింది. ఇందులో పాల్గొని క్విజ్ పూర్తిచేసిన వారిలో లక్కీ విజేతలను ఎంపిక చేస్తారు.
ఎలా పాల్గొనాలి..?: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన https://isroquiz.mygov.in వెబ్‌సైట్ లేదా mygov.in/chandrayaan3 లోకి వెళ్లి అక్కడే ఉన్న ‘పార్టిసిపేట్ బటన్’ను నొక్కాలి. అక్కడ పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, పుట్టిన రోజు, రాష్ట్రం, జిల్లా వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. అనంతరం ప్రొసీడ్ బటన్ నొక్కితే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ‘క్విజ్’ ప్రశ్నలు ఒక్కొకటి వస్తుంటాయి.
Here's ISRO Tweet
Chandrayaan-3 MahaQuiz:@mygovindia has organised Chandrayaan-3 MahaQuiz honouring India's amazing space exploration journey, to explore the wonders of the moon, and to demonstrate our love of science and discovery.
All Indian Citizens are invited to take the Quiz at… pic.twitter.com/yy7ULjTcGL
— ISRO (@isro) September 5, 2023
అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ప్రయాణానికి సంబంధించి ఈ క్విజ్‌లో 10 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 300 సెకన్లలో వీటిని పూర్తిచేయాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉండదు. ఒక్కో వ్యక్తికి వేర్వేరు ప్రశ్నలు వస్తాయి. ISRO, MyGov సంయుక్తంగా చేపడుతోన్న ఈ ఆన్‌లైన్ పోటీలో ఈ రెండు విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు, వారి కుటుంబీకులు పాల్గొనేందుకు అనర్హులు. సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఎప్పటివరకు ఇది కొనసాగుతుంది, తుది విజేతలను ఎప్పుడు ప్రకటిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.