ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అయిదేళ్ల పాటు నిషేధం విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్’ (RHFL)లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 24 సంస్థలకూ నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అనిల్ అంబానికి షాకిచ్చిన సెబీ, ఐదేళ్ల బ్యాన్-25 కోట్ల ఫైన్, అనిల్‌కు చెందిన 24 కంపెనీలపై నిషేధం
అనిల్ అంబానీపై రూ. 25 కోట్ల ఫైన్ కూడా వేసింది సెబీ. లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్ పోస్టు నుంచి కూడా ఆయన్ను తప్పించారు. మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ఆర్నెళ్ల పాటు నిషేధించింది. రూ.6 లక్షల జరిమానా కూడా విధించింది. 2022లోనూ సెబీ వీరందరిపై నిషేధం విధించడం గమనార్హం. సెబీ మొత్తం 222 పేజీల రిపోర్టును రిలీజ్ చేసింది. ఆర్‌హెచ్ఎఫ్ఎల్ కంపెనీ నుంచి ఫండ్స్ ను దారి మళ్లించినట్లు అనిల్‌పై ఆరోపణలు ఉన్నాయి. అనిల్ అంబానీ వత్తిడి వల్ల కీలక మేనేజ్మెంట్ పదవుల్లో ఉన్న వ్యక్తులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇతర సంస్థలు నిధుల గ్రహీతలుగా లేదా మళ్లింపునకు మధ్యవర్తిగా వ్యవహరించాయని సెబీ తెలిపింది. ఈ రుణాలు పొందిన చాలా కంపెనీలు తిరిగి చెల్లించటంలో విఫలమయ్యాయని వివరించింది. ఫలితంగా ఆర్‌ఎఫ్‌హెచ్‌ఎల్ దివాలా తీసి ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పరిష్కార ప్రణాళికకు వెళ్లాల్సివచ్చిందని పేర్కొంది. తద్వారా పబ్లిక్ షేర్‌హోల్డర్ల పరిస్థితి దుర్భరంగా మారిందని వివరించింది.